క‌రోనా ఎఫెక్ట్ అన్ని రంగాల‌పైనా ఉంది. ప‌రిశ్ర‌మ‌లు మూత‌బ‌డ్డాయి. ప‌నులు లేకుండా పోయాయి. ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యా రు. బ‌య‌ట‌కు వ‌స్తే.. ఎక్క‌డ క‌రోనా వ్యాపిస్తుందోననే భ‌యంతో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు గ‌డ‌ప దాట‌డం లేదు. అయితే, ఇంత విప‌త్క‌ర ప‌రిస్థితిలోనూ ప్రాణాల‌కు తెగించి ఎవ‌రైనా ప‌నిచేస్తున్నారంటే.. అది పోలీసులు, వైద్యులు, సైన్యం, పారిశుధ్య కార్మికులు. ఇంత వ‌రకు బాగానే ఉంది. వీరికి ప్ర‌భుత్వాలు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు అండ‌గా ఉంటున్నాయి. పూర్తి స్థాయి వేత‌నాలు అందేలా, ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టేలా చూస్తాయి. మ‌రి ఇదే స‌మ‌యంలో ఇంట్లో కాలుక‌ద‌ప‌కుండా కూర్చోనే స‌గ‌టు ప్ర‌జ‌ల‌కు వార్త‌ల‌ను అందిస్తున్న జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి ఏంటి?  

 

వారిని ఎదురు ఆదుకుంటారు?  ప్రైవేటు రంగంలో ఉన్నాయి క‌నుక ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోవు. మ‌రి ప‌నిచేయించుకుంటున్న మీడియా సంస్థ‌లైనా జాలి చూపుతున్నాయా? త‌మ ఉద్యోగుల‌కు క‌నీసం సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నాయా? అంటే.. నేతి బీర చందం గానే ఉంది. లాక్‌డౌన్ ప్రారంభం కాగానే వంద‌ల సంఖ్య‌లో మీడియా సంస్థ‌లు ఉద్యోగుల‌ను వ‌దిలించుకున్నాయి. జీతాల‌ను కోసేశాయి. ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు తెల్లారిలేస్తే.. నీతులు చెప్పే తెలుగు మీడియా కూడా ఇదే ప‌ని చేసింది. అయినా ఏం చేస్తారు.. క‌లం తిప్ప‌డం త‌ప్ప‌.. మ‌రో ప‌ని చేత‌గాని జ‌ర్న‌లిస్టులు అయినా పంటి బిగువున బాధ భ‌రించారు. ఈ నెల వ‌ర‌కే క‌దా? అని గ‌త నెల‌లో అనుకున్నారు.

 

మ‌రి ఇలా ఒక్క‌నెలకే ప‌రిమితం అయి ఉంటే.. ఇప్పుడు ఇలా మ‌రోసారి మీడియా మంట‌ల గురించి గుండెలు బాదుకోవాల్సిన‌ ప‌ని లేదు క‌దా?! తాజాగా లాక్‌డౌన్ ఎత్తేసే త‌రుణం వ‌చ్చిన మే నెల‌లోనూ తెలుగు మీడియా జ‌ర్న‌లిస్టులు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. ఈ నెల‌లో అంటే.. ఏప్రిల్ నెల తాలూకు చేసిన ప‌నికిగాను వారికి జీతంలో స‌గం కోత పెట్టారు. తెలుగు మీడియాలో నాలుగు అగ్ర‌శ్రేణి దిన‌ప‌త్రిక‌ల్లోనే (తెలంగాణ మీడియాతో క‌లిపి ) స‌గం వేత‌నాల‌ను త‌గ్గించారు. గ‌త నెల‌లో ఇది పాతిక శాత‌మే! ఇక‌, అదే స‌మ‌యంలో ప్ర‌తినెల కొన్ని ప్ర‌ధాన దిన‌త‌ప‌త్రిక‌లు 1వ తారీకు వేత‌నాలు ఇస్తే.. ఈ నెల‌లో అది 10వ తారీకు వ‌ర‌కు అంద‌లేదు. ముందుగా చెప్ప‌నూ లేదు.

 

ఇక త‌న ప‌లుకుల‌తో నీతి వ్యాఖ్యాలు చెప్ప‌డంలో అందెవేసిన చేయి అయిన ఓ మీడియా అధినేత పేప‌ర్లో అయితే జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఉంద‌ని ఆఫ్ ద రికార్డ్‌గా ఆ ప‌త్రిక ఉద్యోగులే చెపుతున్నారు. నెల నెల 11న ఇచ్చే వేత‌నాలు మేలో 20 దాటినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. ఇక‌, ఈ ఇచ్చే వేత‌నాల్లో 50 శాతం కోత పెట్టి.. ఇస్తార‌ని తెలియ‌డంతో జ‌ర్న‌లిస్టులు గుండెలు బాదుకుంటున్నారు. మ‌రి ఇప్పుడు వీరిని ఆదుకునేందుకు ఎవ‌రైనా మీడియా సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయాలేమో చూడాలి!! మొత్తానికి ప్రపంచాన్ని అర‌చేతిలో చూపించే జ‌ర్న‌లిస్టులు ఆకులు మేస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: