మద్యం అమ్మకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్లే అనిపిస్తోంది. ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం చూస్తే  ప్రతి ఒక్కరికీ  ఈ విషయం అర్ధమైపోతోంది. మద్యం ధరలను ఒక్కసారిగా పెంచేయటం వల్ల మద్యం తాగే వాళ్ళు మెల్లిగా తగ్గిపోతారన్న జగన్ ఆలోచనను ప్రతిపక్షాల నేతలు ఎంతగా ఎగతాళి చేశారో అందరూ చూస్తున్నదే.  కానీ క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తున్న తర్వాత  ప్రతిపక్షాల నేతల ఆరోపణలు, విమర్శల్లో పసలేదన్న విషయం స్పష్టమైపోయింది.

 

దాదాపు 45 రోజుల లాక్ డౌన్ తర్వాత కేంద్రప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో రాష్ట్రప్రభుత్వం కూడా మద్యం షాపులను తెరిచింది. ఎప్పుడైతే షాపులను తెరిచారో మందుబాబులో ఒక్కసారిగా షాపులపై ఎగబడ్డారు. ఆడ, మగ తేడా లేకుండా వేలాదిమంది ఒకేసారి షాపులపై ఎగబడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సరే ఈ విషయం ఎలాగున్నా జనాలు వేలం వెర్రిగా షాపుల మీదకు ఎగబడటంతో సోషల్ డిస్టెన్సింగ్ సాధ్యం కాలేదు. అందులోను జనాలు ఎగబడటంతో మద్యం అమ్మకాలు కూడా ఊపందుకుంది.

 

దాంతో ప్రతిపక్షాల నేతలంతా జగన్ మీద ఆరోపణలు మొదలుపెట్టారు. మొదటి రోజు అప్పటి ధరలపై జగన్ 25 శాతం అదనంగా పెంచాడు. మొదటిరోజు అనుభవంతో రెండో రోజుకు మరో 50 శాతం పెంచాడు. అంటే లాక్ డౌన్ ముందు ధరలతో పోల్చితే ఒక్కసారిగా 75 శాతం ధరలు పెరిగినట్లైంది. దాంతో ధరలు పెంచిన జగన్ మీద రకరకాల ఆరోపణలతో  మళ్ళీ ప్రతిపక్షాల నేతలు విరుచుకుపడ్డారు. అయితే ఆశ్చర్యకరంగా నాలుగో రోజు నుండి షాపుల దగ్గర జనాల సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో ప్రతిపక్షాలకు ఏమి మాట్లాడాలో ఇపుడు అర్ధం కావటం లేదు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మద్యం అమ్మకాలపై జగన్ నిర్ణయాన్ని సిపిఎం నేత నర్సింగరావు  అభినందించారు. మద్యం ధరలను పెంచేయటాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.  దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని జగన్ గతంలో చెప్పినట్లే ఇపుడు షాపులను తగ్గించటం, బార్ల సంఖ్యను కుదించటం, ధరలను బాగా పెంచేయటం మంచిదే అని ఓ చర్చా కార్యక్రమంలో అభినందించారు.

 

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా 4వ తేదీన రాష్ట్రం మొత్తం మీద 70 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. తర్వాత మరో నాలుగు రోజులు పర్వాలేదనుకున్న అమ్మకాలు మొన్నటి 9వ తేదీన బాగా పడిపోయింది. 9వ తేదీన 41 కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడైంది. అంటే 4వ తేదీ నుండి చూస్తే 9వ తేదీకి 30 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు పడిపోయాయని లెక్కలు చెబుతున్నాయి.  ఇంకా 10వ తేదీ లెక్కలు రావాల్సుంది. మొత్తం మీద ధరలు పెంచేసి మందుబాబులకు షాక్ ఇవ్వాలన్న జగన్ ప్లాన్ సక్సెస్ అవుతున్నట్లే అనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: