స్నేహమంటే ఇదేరా అన్నట్టుగా ఏపీ సీఎం జగన్తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు ఒకరికొకరు అన్ని విషయాల్లో సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గతంలో ఏ ఇద్దరు ముఖ్యమంత్రులు లేనంత చనువు ఈ  ఇద్దరి మధ్య ఏర్పడింది. రానురాను వీరి స్నేహం బలపడింది. తనకు రాజకీయ బద్ధశత్రువుగా భావిస్తూ వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కకూడదనే మరో కోణంలోనూ, జగన్ కు కెసిఆర్ ఎన్నికల సమయంలో అన్ని రకాలుగా సహాయపడ్డాడు. ఏపీలో జగన్ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వెళ్లి మరి జగన్ కేసీఆర్  కృతజ్ఞతలు చెప్పారు. ఇక అన్ని విషయాల్లోనూ కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకుందామని, ఎటువంటి వివాదాలకు వెళ్లకుండా సమస్యలన్నిటినీ సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఇద్దరి మధ్య తీర్మానం కూడా జరిగింది. అనుకున్నట్లుగానే విభజన కు సంబంధించిన విషయాలను, ఆర్థికపరమైన విషయాల్లో రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అధికారులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నదుల అనుసంధానం దగ్గర నుంచి మిగతా అన్ని విషయాల పైన ఇద్దరు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. 

 
 
ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, జలవనరుల నిపుణులు, ఇలా అందరితోనూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఒక అంగీకారానికి వచ్చారు. అయితే ఆ తర్వాత సీన్ మారింది. కెసిఆర్ ట్రాప్ లో  జగన్ పడిపోతున్నట్లు కొంతమంది జల రంగ నిపుణులు జగన్ కు సూచించారో ఏమో తెలియదు గానీ, కేసీఆర్ ను సంప్రదించకుండానే జగన్ శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తీసుకెళ్ళే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుకునేలా జీవో తీసుకువచ్చారు. ఆ జీవో నే 203. అది ఒక రకంగా తెలంగాణ ప్రయోజనాలకు చేటు చేసే జీవో అని తెలంగాణలో రచ్చ మొదలైంది. రోజు లక్ష 15 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయే ఎత్తుగడ జగన్ వేస్తున్నారని, జగన్ ను ఈ విధంగా వదిలేస్తే ... అదే శ్రీశైలం మీద ఆధారపడిన తెలంగాణ ప్రాజెక్టులు సంగతేంటి అనే ప్రశ్న కెసిఆర్ కు  ఎదురయింది. దీంతో ఇక్కడే వివాదం ముదిరింది. 
 
 
 
జగన్ తీసుకొచ్చిన 203 జీవో ఉమ్మడి ప్రయోజనాల కోసం ఏమో అని కెసిఆర్ మొదట్లో పట్టించుకోలేదు. కానీ ఆ విధంగా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తే , రాజకీయంగా ముందు ముందు తనకు ఇబ్బంది అవడంతో పాటు, ఇప్పటికే తెలంగాణలోని రాజకీయ ప్రత్యర్ధులు తనపై ఈ విషయంలో విమర్శలు మొదలుపెట్టడంతో కెసిఆర్  జగన్ తీరును తప్పుబడుతూ కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి తో కరోనా కు సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్  ముగిసిన అనంతరం, ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి దీనిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీనిని బట్టి చూస్తే రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం ఇప్పుడు అప్పుడే తేలే వ్యవహారం కాదు అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. కెసిఆర్ కు తెలంగాణ ప్రయత్నాలు ఎంత ముఖ్యమో జగన్ కు ఏపీ ప్రయోజనాలు అంతే ముఖ్యం.
 
 
 ఈ నేపథ్యంలోనే తమ స్నేహాన్ని సైతం పక్కన పెట్టేసి ఇప్పుడు పోతిరెడ్డిపాడు అంశంపై ఇద్దరు మిత్రులు పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు,  మాటల యుద్ధం మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ ఇద్దరు మిత్రుల మధ్య సఖ్యత ఇప్పట్లో కుదిరేపని కాదు అనే విషయం స్పష్టంగా అర్థమైపోతోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: