ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ గ్యాస్ లీకేజి ప్రమాదంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తొందరపాటు ప్రకటన ఇపుడు ప్రభుత్వానికి గుదిబండ లాగ తయారైంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుగా తయారైంది జగన్ వ్యవహారం. గ్యాస్ లీకేజీ కారణంగా చనిపోయిన వారికి కోటి రూపాయలు, మూడు రోజులు వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్న వారికి లక్ష రూపాయలు,  అస్వస్ధతకు గురైన వారికి 25 వేలు, బాధిత గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ 10 వేల రూపాయలు ఇలా నష్ట పరిహారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

 

జగన్ నష్టపరిహారాన్ని ప్రకటించినపుడు ఆహా ఓహో అన్న జనాలే ఇపుడు మండిపోతున్నారు. అదే సమయంలో  నష్ట పరిహారం విషయంలో మాట పడిపోయిన ప్రతిపక్షాలు ఇపుడు జగన్ పై ఆరోపణలతో రెచ్చిపోతున్నాయి.  అలాగే నష్ట పరిహారం అందుకున్న బాధితులు కూడా జగన్ పై విరుచుకుపడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. దీనికంతటికి మూల కారణం జగన్ తొందర పాటే అని అర్ధమవుతోంది. ప్రమాదం జరగగానే నష్ట పరిహారం ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది ? జరిగిన ప్రమాదంపై నిపుణుల కమిటిని విచారణకు వేసి నివేదిక వచ్చిన తర్వాత నష్ట పరిహారం ఇస్తానని ప్రకటించుంటే సరిపోయేది.

 

బాధితులకు కూడా ప్రభుత్వమే వైద్యం చేయించి ఇళ్ళకు పంపేస్తే సరిపోయేది. ఎలాగూ ప్రతిపక్షాలు మృతులకిచ్చే నష్ట పరిహారం, బాధితులకు చేయాల్సిన సాయం విషయంలో డిమాండ్లు చేస్తునే ఉంటాయి.  ఒకవైపు ఇవన్నీ జరుగుతుండగానే మరోవైపు నిపుణుల కమిటి విచారణ, కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపిన తర్వాత నష్ట పరిహారం విషయంలో  ఓ క్లారిటి వస్తుంది. అప్పుడు బాధిత కటుంబాలు, బాధితులతో చర్చలు జరిపి నష్ట పరిహారాన్ని ప్రకటించుంటే బాగుండేది. ఇదంతా జరిగేటప్పటికి ఓ 20 రోజులయ్యేది కాబట్టి బాధుతులు, బాధిత కుటుంబాలతో పాటు ప్రతిపక్షాల్లో కూడా ఆవేశం తగ్గిపోయేదే.

 

అయితే జగన్ పై విషయాలేవీ పట్టించుకోకుండా నేరుగా కోటి రూపాయలు ప్రకటించేయటంతో సమస్య మొదలైంది. జగన్ ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఏమాత్రం సరిపోదని ఇపుడు చంద్రబాబు అండ్ కో మాట్లాడుతున్నారంటే అర్ధమేంటి ? తన హయాంలో ఎవరు చనిపోయినా రూ. 10 లక్షలకు మించి ఇవ్వని చంద్రబాబు కూడా ఇపుడు కోటి రూపాయలు సరిపోదనటమే  విచిత్రంగా ఉంది. అలాగే బాధితులు, బాధిత కుటుంబాలు కూడా నష్టపరిహారం తీసుకుని కూడా జగన్ ను శాపనార్ధాలు పెడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

ప్రతిపక్షాలంటే ప్రతిదీ వ్యతిరేకిస్తునే ఉంటాయి. మరి బాధితులు, బాధిత కుటుంబాలు కూడా ఎందుకు జగన్ ను అమ్మనాబూతులు తిడుతున్నారు ? ఎందుకంటే ఆశకు అంతుండదు కాబట్టే. పైగా వీళ్ళని వెనకనుండి ప్రతిపక్షాలు ఆడిస్తున్నాయి కాబట్టే. జరిగిన ప్రమాదంలో ప్రభుత్వం బాధ్యతేమీ లేకపోయినా మానవతా దృక్పధంతో జగన్ చేసిన ఓ తొందరపాటు ప్రకటనే ఇపుడు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైందనటంలో సందేహమే లేదు. కాబట్టి భవిష్యత్తులో అయినా నష్టపరిహారాలు ప్రకటించేముందు కాస్త ముందు వెనకా ఆలోచించుకుంటే మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: