తెలుగు సినిమా రంగంలో వెన్నెల‌ను పూయించిన క‌వి ఆయ‌న‌. న‌ట‌న‌లో న‌వ‌ర‌సాలు ఉన్న‌ట్లే ఆయ‌న సినిమా పాట‌లో అన్ని ర‌సాలు మ‌న‌కు వినిపిస్తున్నాయి. హీరో హీరోయిన్ల మ‌ధ్య డ్యూయెట్ల‌లోనూ సాహిత్యాన్ని చొప్పించిన ఏకైక సినీ క‌వి ఆయ‌న‌. మంచి పాట‌లు రాయ‌డానికి అహోరాత్రులు నిద్ర‌ను త్య‌జించిన నిషిరాత్రి యోధుడు ఆయ‌న‌. ఆయ‌న్ను ఎంత పొగిడినా త‌క్కువేన‌ని అనిపిస్తుంటుంది. ఆయ‌నే తెలుగు క‌ళ‌మాత‌ల్లి ముద్దుబిడ్డ శ్రీ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. తెలుగు సినిమా రంగంపై నాలుగు ద‌శాబ్దాలుగా త‌న సినీ గేయ ర‌చ‌న‌ల‌తో అభిమానుల‌ను అల‌రిస్తున్నారు.  సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. 

 

శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి, విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి దంప‌తుల‌కు జ‌న్మించారు. సీతారామ‌శాస్త్రి 1986లో క‌ళాత‌ప‌స్వి కె. విశ్వనాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సిరి వెన్నెల సినిమాతో సినీ గేయ ర‌చ‌యిత‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. కెవి మ‌హ‌దేవ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసిన ఈ సినిమాకు పాట‌ల‌న్ని కూడా సీతారామ‌శాస్త్రియే రాయ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాలో పాట‌ల‌న్ని ఆల్‌టైం సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. ఇప్ప‌టికీ ఈ పాట‌ల‌కు చెవికోసుకునే సంగీత ప్రియులున్నారంటే అతిశేయోక్తి కాదు. ఈ సినిమాలో సీతారామ‌శాస్త్రి కురిపించిన సాహిత్య‌పు వెన్న‌ల‌ను యావ‌త్ తెలుగు ప్ర‌పంచం త‌డిసి ముద్ద‌యింది. 

 

సినిమా హిట్టు తర్వాత ఆయ‌న కెరీర్‌లో వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. వేలాది పాట‌లు ఆయ‌న క‌లం నుంచి జాలువారాయి. ప్ర‌శంస‌లు... పుర‌స్క‌రాల‌కు లెక్క‌లేదు. నంది అవార్డుల‌తో  ఆయ‌న సినీ సాహిత్య సేవ‌ల‌ను ప్ర‌భుత్వాలు గౌర‌వించాయి. ప్రముఖ తెలుగు, హిందీ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని... అని పాట పాడే ప్రభావశీలమయిన పాత్రలో తను వ్రాసి నటించగా, తను వ్రాసిన పాటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం లభించటం విశేషం. 

 

సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల. ఈ రోజు జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రుపుకుంటున్న సిరివెన్నెల‌కు  ఇండియ హెరాల్డ్ పాఠ‌క‌లోకం త‌రుపున శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాం. ఆయ‌న ఆయురారోగ్యాల‌తో వ‌ర్ధిల్లిలాల‌ని వేడుకుంటున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: