శ్రీశైలం ప్రాజెక్టు నుండి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తు కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని అనుకున్న ఏపి ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా తెలంగాణా ప్రభుత్వం కోర్టులో కేసు వేయబోతున్నట్లు కేసియార్ ప్రకటించటం ఆశ్చర్యంగా ఉంది. ఏపి ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని కేసియార్ చెప్పాడు. తెలంగాణాను సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టయిన శ్రీశైలం నుండి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎలా మళ్ళిస్తారంటూ సూటిగా ప్రశ్నించటం గమనార్హం. ముందుగా కృష్ణా నీటి యాజమాన్య బోర్డుకు కూడా ఫిర్యాదులు చేయాలని కేసియార్ ఆధికారులను ఆదేశించాడు.

 

శ్రీశైలం ప్రాజెక్టు నుండి  మూడు టిఎంసిల నీటిని మళ్ళిచేందుకు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని నిర్ణయిస్తు ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది. ఇపుడా జీవోనే ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేట్లుంది.  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడకుండా, అనుమతి తీసుకోకుండానే ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పూనుకోవటంతోనే కేసియార్ కు బాగా కోపం వచ్చినట్లుంది. అందుకనే న్యాయపోరాటమని హెచ్చరిస్తున్నాడు. పైగా విభజన చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించటమేనంటూ కేసియార్ ఆక్షేపించటమే విచిత్రంగా ఉంది.

 

మొదటి నుండి కూడా విభజన చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నదే కిసియార్.  రాష్ట్ర విభజన తర్వాత ఇటు తెలంగాణాలో కేసియార్, అటు ఏపిలో చంద్రబాబునాయుడు సిఎంలయ్యారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే తెలంగాణాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో  చంద్రబాబు వేలుపెట్టి కాల్చుకున్నాడు. ఓటుకునోటు కేసులో ఇరుక్కుని అరెస్టు భయంతో హైదరాబాద్ ను వదిలేసి విజయవాడ పారిపోయిన విషయం అందరికీ తెలుసు. అరెస్టు భయంతో  కేసియార్ కు చంద్రబాబు పూర్తిగా సరెండర్ అయిపోయాడు.

 

దాన్ని సాకుగా తీసుకున్న కేసియార్ తనిష్టం వచ్చినట్లు విభజన చట్టానికి తూట్లు పొడిచాడు. హైదరాబాద్ లో ఉన్న ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏకపక్షంగా సొంతం చేసేసుకున్నాడు. తెలంగాణా భూభాగంలో ఉన్న అనేక కేంద్ర సంస్ధలు, కేంద్రప్రభుత్వరంగ సంస్ధలను తమకే సొంతమంటూ ప్రకటించేశాడు. ఈ సంస్ధల విభజనకు కేంద్రం నియమించిన షీలాబిడే కమిటి సిఫారసులను కూడా కేసియార్ పట్టించుకలేదు. ఇలా చెప్పుకుంటూపోతే కేసియార్ ఉల్లంఘనలు చాలానే కనిపిస్తాయి.

 

తాజాగా తెలంగాణాలో కడుతున్న కొన్ని ప్రాజెక్టులపై ఏపి ప్రభుత్వం కృష్ణా రివర్ మ్యానేజ్ మెంట్ బోర్డుకు ఫిర్యాదులు చేసింది. అలాగే  పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్కీమ్ సామర్ధ్యాన్ని పెంచాలని అనుకున్న ఏపి ప్రభుత్వంపై ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి రెండు ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి ఫిర్యాదులు చేసుకుంటు రాజకీయంగా హీటెక్కించేస్తున్నాయి.

 

తన శక్తిమేరకు విభజన చట్టాన్ని ఉల్లంఘించిన కేసియార్ ఇపుడు ఏపి ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందంటూ ఆరోపణలు చేస్తుండటమే విచిత్రంగా ఉంది.  శ్రీశైలం ప్రాజెక్టుపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించటంలో ఓ విధంగా తప్పేలేదు. ఎలాగంటే ఏపి టైలెండ్ లో ఉంది. ఎగువన ఉన్న రాష్ట్రాలు వాడుకోగా మిగిలిపోయిన నీరే చివరకు ఏపికి వచ్చి తర్వాత సముద్రంలో కలుస్తోంది. బహుశా వృధాగా పోతున్న నీటిని వాడుకోవాలన్న ఉద్దేశ్యంతోనే  ఎత్తిపోతల పథకం నిర్మించాలని అనుకుని ఉండవచ్చు. దీన్నే కేసియార్ బూతద్దంలో చూపిస్తు న్యాయపోరాటం అంటూ బెదిరిస్తున్నాడు. చూద్దాం ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: