పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.  చంద్రబాబు ఒంటెత్తుపోకడలను పార్టీలోని కొందరు కీలక నేతలు తీవ్రంగా విభేదిస్తున్నట్లే తెలిసిపోతోంది. దాంతో తమ ప్రాంత ప్రయోజనాల కోసం సొంతంగానే అటువంటి నేతలు గళం విప్పుతున్నారు.   దాంతో నేతలపై చంద్రబాబు పట్టుజారి పోతోందనే విషయం అందరికీ అర్ధమైపోతోంది. కడప జిల్లాలో కీలక నేత, ఎంఎల్సీ బిటెక్ రవి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలికాడు. రాయలసీమకు నీళ్ళిచ్చే ప్రయత్నం ఎవరు  చేసినా అండగా ఉంటానని, జీవో 203ను తాను సమర్ధిస్తున్నట్లు ప్రకటించటం పార్టీలో సంచలనంగా మారింది.

 

నిజానికి బిటెక్ రవి చేసిన ప్రకటనను చంద్రబాబే చేసుంటే ఎంతో హుందాగా ఉండేది. తాను కూడా రాయలసీమ వాసినే అంటూ ఎన్నోసార్లు చంద్రబాబు ప్రకటన చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు రాయలసీమ వాసన్న విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అయితే ఏనాడు సీమ అభివృద్ధికి చేసిన ప్రయత్నం శూన్యమనే చెప్పాలి. పైగా రాష్ట్రంలో ఎక్కడ గొడవలు జరుగుతున్నా రాయలసీమ గుండాలని, పులివెందల రౌడీలని నోరు పారేసుకోవటం ద్వారా రాయలసీమను ఎన్నిసార్లు అవమానించాడో లెక్కేలేదు.

 

తాజాగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ పోతిరెడ్డిపాడు స్కీమ్ ను బలోపేతం చేయాలని డిసైడ్ చేస్తే దాన్ని కూడా రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలా అనే ఆలోచిస్తున్నాడు. అందుకనే ఇప్పటివరకూ నోరిప్పింది లేదు.  ఇటువంటి పరిస్ధితుల్లో బిటెక్ రవి చేసిన ప్రకటన పార్టీలో కలకలం రేపుతోంది. బహుశా ఈరోజు బిటెక్ రవి ప్రకటన చేసినట్లే తొందరలో ఇంకొంతమంది జగన్ నిర్ణయానికి జై కొట్టినా ఆశ్చర్యం లేదు.

 

ఇదే విధంగా మొన్న వైజాగ్ సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో కూడా చంద్రబాబు రాజకీయం చేద్దామని చూశాడు. కానీ పార్టీ ఎంఎల్ఏ గణబాబు ప్రభుత్వం స్పందించిన తీరు బ్రహ్మాండంగా ఉందని చేసిన ప్రకటన షాక్ చంద్రబాబుకు కొట్టింది. గణబాబు దెబ్బకు రెండు రోజులు చంద్రబాబు ఏమీ మాట్లాడలేకపోయాడు. సరే తర్వాత తనదైన చౌకబారు రాజకీయాలు మొదలుపెట్టేశాడు.

 

అంతకుముందు జగన్  మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా టిడిపి ఎంఎల్ఏలు ఆహ్వానించారు. నిజానికి  ఈ విషయంలో చంద్రబాబు ఎంత గోల చేస్తున్నాడో అందరూ చూస్తున్నదే. తమ ప్రాంతం అభివృద్ధి పేరుతో విశాఖ నగరంలోని ఉత్తరం ఎంఎల్ఏ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మరికొందరు నేతలు కూడా జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు.

 

జగన్ నిర్ణయానికి విరుద్ధంగా పార్టీ జిల్లా కమిటిలు తీర్మానాలు చేసి పంపాలన్న చంద్రబాబు ఆదేశాలను కూడా నేతలు పట్టించుకోలేదు. పైగా జగన్ నిర్ణయానికి మద్దతుగా విశాఖ అర్బన్ జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కమిటిలు తీర్మానాలు చేయటం అప్పట్లో పార్టీలో సంచలనమైంది.  అంటే జరుగుతున్నది చూస్తుంటే పార్టీలో చంద్రబాబు పట్టుజారి పోతోందా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: