ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం దూకుడుగా ముందుకు వెళుతోంది. అటు అభివృద్ధి ప‌రంగా గాని... ఇటు సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో గాని.. అటు ప్ర‌తిప‌క్ష పార్టీల విష‌యంలో కాని చాలా దూకుడుగా వెళుతోంది. ఇక మ‌ధ్య‌లో కోర్టుల నుంచి ఒక‌టి రెండు మొట్టికాయ‌లు ప‌డినా కూడా జ‌గ‌న్ ఎక్క‌డా లెక్క చేయ‌కుండా త‌న పంథాలో తాను వెళుతున్నారు. ఇదిలా ఉంటే శుక్ర‌వారం ఏపీ ప్ర‌భుత్వానికి కోర్టు నుంచి మూడు విష‌యాల్లో పెద్ద షాక్ త‌గిలింది. జోరుమీదున్న జ‌గ‌న్‌కు ఇది కాస్త బ్రేక్ లాంటిదే అని చెప్పాలి. 

 

శుక్ర‌వారం హైకోర్టు మూడు విష‌యాల్లో ఇచ్చిన తీర్పు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేసింది. ముందుగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును స‌స్పెండ్ చేసే విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం దూకుడుగా వ్య‌వ‌హ‌రించింది. అప్పుడు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు క్యాట్‌ను ఆశ్ర‌యించినా కూడా క్యాట్ సైతం స‌స్పెన్ష‌న్‌ను స‌మ‌ర్థించింది. ఈ విష‌యంలో ఆయ‌న కేంద్రం వ‌ర‌కు వెళ్లి వ‌చ్చినా ఏం చేయ‌లేక‌పోయారు. ఇక తాజాగా త‌న స‌స్పెన్ష‌న్‌పై ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిని హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. క్యాట్ సైతం ముందుగా  ఏబీ స‌స్పెన్ష‌న్‌ను స‌మ‌ర్థించ‌గా ఇప్పుడు హైకోర్టు దీనిని ప‌ట్టించుకోలేదు. క్యాట్ ఇచ్చిన తీర్పును కూడా హైకోర్టు ప‌క్క‌న పెట్టేసింది.

 

ఇక రెండో విష‌యానికి వ‌స్తే ఏపీలో ఉన్న గ్రామ స‌చివాల‌యాల‌కు మూడు రంగ‌లు వేయ‌డాన్ని కోర్టు త‌ప్పు ప‌ట్టింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో వీటిని మార్చాల‌ని కోర్టు సూచించింది. అయితే ప్ర‌భుత్వం మూడు రంగుకు నాలుగో రంగు వేయ‌మ‌ని జీవో ఇచ్చింది. ఇప్పుడు తాజాగా కోర్టు ఈ జీవోను స‌స్పెండ్ చేసేసి.. మేం ఇచ్చిన‌ తీర్పు మీరు లెక్క చేయ‌రా ?  కోర్టు ధిక్కార‌ణ చ‌ర్య‌లు మొద‌లు పెట్టాల‌ని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జీవో ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై రాష్ట్ర హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు 623జీవోను కొట్టివేసింది. 

 

సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పంచాయతీ కార్యాలయలకు రంగుల వేయడం కోసం మరో జీవో ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర పంచయతీ రాజ్ సెక్రెటరీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా కోర్టు ధిక్కరణ ప్రక్రియను కూడా ప్రారంభించాలని రిజిస్ట్రార్‌‌ను కోర్టు ఆదేశించింది. ఇక మూడో కేసులో విశాఖ జిల్లాలోని న‌ర్సీప‌ట్నం డాక్ట‌ర్ సుధాక‌ర్ విష‌యంలో ఏకంగా హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సుధాక‌ర్ మాస్క్‌లు లేవంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌భుత్వం ఆయ‌న్ను స‌స్పెండ్ చేయ‌డం.. త‌ర్వాత సుధాక‌ర్‌ను వైజాగ్‌లో అరెస్టు చేయ‌డం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

 

ఇక ఈ విష‌యంలో హైకోర్టు ఈ విష‌యంలో ప్ర‌భుత్వాన్ని న‌మ్మ‌డం లేద‌ని కూడా చెప్పింది. ఈ కేసును సీబీఐకు ఇస్తున్నాం అని... మెజిస్ట్రేట్ ఇచ్చిన నివేదిక‌కు మీ నివేదిక‌కు తేడా ఉంది. అని చెప్పింది. మెజిస్ట్రేట్ నివేదిక‌లో సుధాక‌ర్‌కు గాయాలు ఉన్నాయ‌ని ఉంటే... మీ నివేదిక‌లో గాయాలు లేవ‌ని చెప్పార‌ని కోర్టు ప్ర‌భుత్వాన్ని త‌ప్పుప‌ట్టింది. ఇది కూడా ఓ విధంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ లాంటిదే. ఏదేమైనా మూడు కీల‌క కేసుల విష‌యంలో ప్ర‌భుత్వానికి అదిరేలా కోర్టు నిర్ణ‌యాలు అయితే వ‌చ్చాయ‌నే చెప్పాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: