క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  నిజానికి ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి పథకాల అమలుతో బిజీగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి కొన్ని చిన్న చిన్న సంఘటనలు చికాకులు తెప్పిస్తున్నాయి.  దానికి తోడు ఎవరి ఆదేశాల ప్రకారం జరుగుతోందో తెలీదు కానీ పోలీసుల అత్యత్సాహం కూడా జగన్ కు చెడ్డపేరు తెస్తోంది.  గుంటూరు జిల్లాలో రంగనాయకమ్మ, విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ వ్యవహారాలే నిదర్శనం.

 

ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ప్రమాదంపై గుంటూరు జిల్లాకు చెందిన రంగనాయికమ్మ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు ప్రమోట్ చేసింది వాస్తవం. అందుకనే ఆమెపై సిఐడి పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. రంగనాయికి నూరుశాతం టిడిపి యాక్టివిస్టనటంలో సందేహమే లేదు. ఈమె వెనకాల చంద్రబాబునాయుడు, లోకేష్ లాంటి వాళ్ళు చాలామందే ఉండచ్చు. అంత మాత్రాన ఆమెపై కేసు నమోదు చేసి విచారించాల్సిన అవసరం లేదు.

 

ఎందుకంటే జగన్ పై టిడిపి వాళ్ళు చల్లుతున్న బురదను మెజారిటి జనాలు ఎవరూ పట్టించుకోవటం లేదు. నిజానికి ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న తర్వాతే రంగనాయికి అనే కార్యకర్తకు గుర్తింపు వచ్చింది. లేకపోతే ఆమె ఎవరో బయట వాళ్ళెవరకీ తెలిసిది కూడా కాదు. అలాంటిది చిన్న విషయాన్ని ప్రభుత్వం గోకి గోకి పెద్దది చేసుకుంటోంది. జగన్ విషయంలో టిడిపి ఇలాగే చవకబారుగానే  వ్యవహరిస్తుంది. మొన్నటి ఎన్నికల ముందు కూడా ఇలాగే వ్యవహిరంచిన విషయం బహుశా జగన్ మరచిపోయినట్లున్నాడు.

 

ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ పై ఎంత వీలుంటే అంత బురదా చల్లేసింది టిడిపి. అయినా చివరకు ఏమైంది ? 151 సీట్ల అఖండ మెజారిటితో వైసిపి అధికారంలోకి రాలేదా ? అంటే ఏమిటర్ధం ? జగన్ గురించి టిడిపి ఏమి చెప్పినా జనాలు నమ్మలేదనే కదా అర్ధం. మరి అంతటి వ్యతిరేకతను తట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి గురించో లేకపోతే టిడిపి మద్దతుదారులు పెడుతున్న వ్యతిరేక పోస్టుల విషయాన్ని ఎందుకింత సీరియస్ గా తీసుకుంటున్నది ప్రభుత్వం ?

 

అలాగే డాక్టర్ సుధాకర్ విషయంలో కూడా పోలీసులు చాలా అత్యుత్సాహంగా వ్యవహరించినట్లే అనిపిస్తోంది. చిన్న సంఘటనపై హైకోర్టు చాలా సీరియస్ గా తీసుకుని కేసును సిబిఐ విచారణకు ఆదేశించటమే ఆశ్చర్యంగా ఉంది. మద్యం తీసుకుని డాక్టర్ నడిరోడ్డులో గోల చేసింది వాస్తవమే. జగన్ను అమ్మనాబూతులు తిట్టిందీ నిజమే. దానికి పెట్టాల్సిన కేసులు వేరే ఉన్నాయి. అంతేకానీ ఏకంగా డాక్టర్ ను పిచ్చాసుపత్రికి తరలించటం సంచలనమైపోయింది. దానికి తగ్గట్లు టిడిపి కూడా తెరవెనుక ఉండ కథ నడిపిస్తోందన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా విషయాలను డీల్ చేయాలి. లేకపోతే ఎవరు అత్యుత్సాహం చూపించినా చివరకు అభాసుపాలయ్యేది జగనే.

మరింత సమాచారం తెలుసుకోండి: