ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టినా, ప్రభుత్వంలోని పెద్దలను, అధికారులను విమర్శిస్తూ ఎవరైనా పోస్ట్  పెట్టినా లేదా వేరే వారు పంపిన పోస్ట్‌ను మరొకరికి పంపినా జైలుకు వెళ్ళవలసి వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల ధోరణి. ఆ మేరకు వరుసగా పలువురికి నోటీసులు జారీచేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా....విశాఖ గ్యాస్ లీక్ గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించారని గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే 66 సంవత్సరాల వయసున్న ఓ వృద్ధురాలికి సిఐడి పోలీసులు నోటీసు జారీ చేయడం సంచలనం కలిగించింది. 

 

అలాగే కర్నూలు అధికార పార్టీ ఎమ్మెల్యే కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ను లెక్కచేయకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారని బీజేపీ నేత హరీష్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు. అంతే ఏపీ సీఐడీ ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఈ కథ ఈనాటిదేం కాదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టిన వారిపై కొన్ని వందల కేసులు నమోదయ్యాయి. రేషన్ బియ్యంలో నాణ్యత దగ్గర నుండి కృష్ణా వరదల వరకు.. అటు వైసీపీ రంగుల లోకం నుండి.. సంక్షేమ పథకాలలో అవకతవకల వరకు స్పందించిన ఎందరిపైనో కేసులు పెట్టారు.

 

ఈ ఘటనలలో హైకోర్టు జోక్యంతో పాటు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ధర్మాసనం ముందు హాజరై సంజాయిషీ కూడా చెప్పుకోవాల్సి వచ్బింది. నిజంగా చెప్పాలంటే ఇదంతా నాణేనికి ఒకవైపు భాగం లాంటిది. అసలు సోషల్ మీడియా ప్ర‌దాన ఉద్దేశం కేవ‌లం అభిప్రాయ వేదిక మాత్ర‌మే. కానీ, దీనిని విమ‌ర్శ‌ల‌కు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కు.. పెద్ద ఎత్తున వేదిక చేశారు. దీనిని గ‌తంలోనూ సుప్రీం కోర్టు త‌ప్పుప‌ట్టింది. అదేస‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించి చ‌ట్టం చేసింది.

 

గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా సోష‌ల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు, విమ‌ర్శ‌లు చేసే వారిపై ఇంతకన్నా క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించింది. రాజ‌ధానిపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శించిన వారిపై కేసులు పెట్టారు. అదేస‌మ‌యంలో లోకేష్‌ను ప‌ప్పు అన్న వారిపై కేసులు న‌మోదు చేశారు. ఇక‌, అధికారం కోల్పోయిన త‌ర్వాత కూడా సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన సెటైర్ల‌పై కేసులు పెట్టారు. కానీ, ఇప్పుడు గుంటూరులోని బామ్మ కేసు విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు మాత్ర‌మే కొత్త‌గా సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌ల‌ను స‌హించ‌లేక పోతోంద‌నే విధంగా ఎల్లో మీడియాలో క‌ల‌రింగ్ క‌థ‌నం ఇచ్చారు. 

 

వృద్ధురాలిపై కేసులు న‌మోదు చేశార‌ని అంటున్న‌వారు.. ఎల్‌జీ విష‌యంలో ఒక ప్యానిక్ క్రియేట్ చేయ‌డం, అర్ధం లేని ప్ర‌శ్న‌లు సంధించ‌డం.. స‌ద‌రు వృద్ధురాలి భావ స్వేచ్ఛ అయితే.. మితిమీరినప్పుడు, స‌మాజానికి చేటు చేసే అవ‌కాశం ఉన్న‌ప్పుడు అలాంటి వారిని అదుపు చేయ‌డం ప్ర‌భుత్వం బాధ్య‌త‌.

మరింత సమాచారం తెలుసుకోండి: