లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వైసిపి ఎంఎల్ఏలు, నేతల వల్లే కరోనా వైరస్ వ్యాప్తిస్తోందంటూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఆరోపణలు చేయని రోజు లేదు. చంద్రబాబు మొదలుపెట్టగానే ఎక్కడెక్కడో ఉన్న టిడిపి నేతలు కూడా ఇదే పల్లవిని ఎన్నిసార్లు వినిపించారో లెక్కలేదు. ఇంతకీ వైసిపి ఎంఎల్ఏలు, నేతలు ఏమి చేశారయ్యా అంటే బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. సరే ఎంఎల్ఏలు, నేతలు వచ్చారంటే వాళ్ళ మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమిగూడటం సహజమే. ప్రస్తుత పరిస్ధితుల్లో నలుగురు ఒకచోట చేరటం తప్పే అయినా వాళ్ళని నియంత్రించేవాళ్ళు లేరన్నది వాస్తవం.

 

ఈ విషయంలో జగన్ సర్కార్ పై చంద్రబాబు ఎన్నిసార్లు గోల చేశాడో అందరూ చూసిందే. ఏపిలో నమోదైన కేసులన్నీ  వైసిపి ఎంఎల్ఏలు, నేతల వల్లే పెరిగిపోతున్నట్లుగా యాగీ  చేశారు చంద్రబాబు అండ్ కో.  సీన్ కట్ చేస్తే దాదాపు 65 రోజుల లాక్ డౌన్ తర్వాత చంద్రబాబు, చినబాబులు హైదరాబాద్ నుండి ఏపిలోకి అడుగుపెట్టారు. రోడ్డుమార్గంలో విజయవాడ దగ్గరకు వచ్చేటప్పటికి రోడ్డు పొడువునా మాజీ ఎంఎల్ఏలు పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించారు. వాళ్ళంతా చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం కనిపించగానే ఒక్కసారిగా మీదకొచ్చేశారు.

 

నేతలు, కార్యకర్తలను చూడగానే చంద్రబాబు కూడా కారులో నుండి బయటకు వచ్చి వాళ్ళందరికీ అభివాదం చేయటం మొదలుపెట్టాడు. దాంతో వాళ్ళింకా రెచ్చిపోయారు. జగ్గయ్యపేట, కంచికచెర్ల, నందిగామకు చెందిన మాజీ ఎంఎల్ఏలు, నేతలు, శ్రేణులు ఒకళ్ళతో మరొకళ్ళు పోటిపడి చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు దగ్గరకు వచ్చారు. దాంతో సోషల్ డిస్టెన్సింగ్ అన్నది గాలికి కొట్టుకుపోయింది. వచ్చిన వాళ్ళల్లో చాలామందికి మూతికి మాస్కు లేదు. చేతులను  ఎవరూ శానిటైజర్లతో కడుక్కోలేదు. ఒక్కసారిగా కొన్ని వందల మంది చంద్రబాబు ప్రయాణిస్తున్న కారును చుట్టుముట్టేశారు.

 

మరిప్పుడు చంద్రబాబు, టిడిపి నేతల వల్ల కరోనా వైరస్ వ్యాపించదా ? అనే ప్రశ్న మొదలైంది. ఎవరికైనా కరోనా వైరస్ సోకితే చంద్రబాబే  బాధ్యత వహించాలి కదా ? ఎందుకంటే ఇంతకాలం చంద్రబాబు చెప్పిన నీతి సూత్రాల ప్రకారం వైరస్ కేసులకు తానే బాధ్యత తీసుకోవాలి. ఇంతకాలం ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పటం కాదు ఇపుడు సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు ఎంతవరకూ పాటిస్తాడో చూడాల్సిందే. 

 

అసలు చంద్రబాబును రిసీవ్ చేసుకోవటానికి మాజీ ఎంఎల్ఏలు, నేతలు, కార్యకర్తలను రమ్మని చెప్పింది ఎవరు ? ఒకవేళ వాళ్ళే వస్తామని చెప్పినా వద్దని వారించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా ? వైరస్ వ్యాప్తి విషయంలో ఇంతకాలం జగన్+మంత్రులు+ఎంఎల్ఏలు+నేతలపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలు చంద్రబాబు అండ్ కో కు వర్తించవా ? బాధితులకు నిత్యావసరాలు అందించిన ఎంఎల్ఏలపై కేసులు నమోదు చేయమని అడిగిన కోర్టు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చంద్రబాబు అండ్ కో మీద కూడా కేసులు నమోదు చేయమని పోలీసులను ఆదేశించాలి కదా ? మరి ఆ విధంగా ఆదేశిస్తుందా ?  చూద్దాం ఏమి జరుగుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: