లాక్ డౌన్ సందర్భంగా  65 ఏళ్ళ తర్వాత ఏపికి వచ్చిన చంద్రబాబునాయుడుకు సొంత పార్టీ ఎంఎల్ఏలే షాక్ ఇవ్వబోతున్నారా ?  క్షేత్రస్ధాయిలో జరుగుతున్న ప్రచారం, పరిణామాలు చూస్తుంటే చంద్రబాబుకు షాక్ తప్పదనే అనిపిస్తోంది.  పార్టీకి మిగిలిన 20 మంది ఎంఎల్ఏల్లో తొమ్మిది మంది ఈ రోజో రేపో పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతున్నట్లు ప్రచారం ఊపందుకుంటోంది. గురువారం నాడు మొదలవ్వబోయే మహానాడు  సందర్భంగా టిడిపి ఎంఎల్ఏల్లో కొందరిని వైసిపి లాగేసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది.

 

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం తొమ్మిది మంది ఎంఎల్ఏలు టిడిపిని వదిలేసేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రకారం విశాఖపట్నం నార్త్ ఎంఎల్ఏ  గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం సౌత్ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కుమార్, వైజాగ్ వెస్ట్ ఎంఎల్ఏ గణబాబు ఉన్నట్లు సమాచారం. అయితే గంటా ఎప్పటి నుండో ప్రయత్నాలు చేసుకుంటున్నా వైసిపిలోని కీలక నేత అడ్డుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. కాబట్టి గంటా విషయంలో జరుగుతున్న ప్రచారం నమ్మేందుకు లేదు.

 

అలాగే ప్రకాశం జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎంఎల్ఏల్లో ముగ్గురు పార్టీకి హ్యాండ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. జిల్లాలోని పర్చూరు ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్, కొండెపి ఎంఎల్ఏ డాక్టర్ బాల వీరాంజనేయస్వామి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్ పేరు మాత్రం ఎక్కడా వినబడటం లేదు. ఎందుకంటే ఇప్పటికే కరణం వైసిపిలో ఉన్నడాని చెబుతుండటం గమనార్హం.

 

పశ్చిమగోదావరిలో గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఉండి ఎంఎల్ఏ మంతెన రామరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో టిడిపి నాలుగురు గెలిచారు. వీరిలో మండపేట నియోజకవర్గం ఎంఎల్ఏ ఏగుళ్ళ జోగేశ్వరరావు పార్టీ మారిపోతాడని అంటున్నారు.  మొత్తానికి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం దెబ్బకు టిడిపిలో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు మహానాడుకు సరిగ్గా రెండు రోజుల ముందు పార్టీ నుండి ఎంఎల్ఏలు వైసిపిలో చేరబోతున్నారనే ప్రచారం పార్టీ  నేతల్లో  బాగా పెరిగిపోతోంది.

 

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమే అయితే చంద్రబాబుకు రెండు రకాలుగా షాక్ తగిలినట్లే అనుకోవాలి. ఎలాగంటే మొదటిది ఎంఎల్ఏలు పార్టీని వదిలేయటం. ఇక రెండోదేమంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోవటం. చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండాలంటే టిడిపికి 17 మంది ఎంఎల్ఏలు ఉండాలి. అంతకన్నా తక్కువైతే మాత్రం హోదా పోతుంది. అదే జరిగితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఇంతకన్నా ఘోరమైన అవమానం ఇంకేముంటుంది ?

మరింత సమాచారం తెలుసుకోండి: