రాజకీయ పార్టీలన్నాక ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలి. ప్రతి సంవత్సరం పార్టీలు నిర్వహించుకునే కీలకమైన సమావేశాల్లో చేసే సూచనలు, ఇచ్చే సలహాలు ప్రభుత్వానికి ఉపయోగపడేవిగా ఉండాలి. కానీ రెండు రోజుల పాటు టిడిపి ప్రతి ఏటా నిర్వహించుకునే పసుపు పండుగ ’మహానాడు’ ఈసారి డిజిటల్ మహానాడుగా జరిగింది. మామూలుగా మూడు రోజులు జరిగే మహానాడు కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది రెండు రోజులకే కుదించేశారు. మామూలుగా అయితే తమ పార్టీలోని లోపాలు, బలోపేతమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించేందుకు పార్టీ కార్యక్రమాలు పెట్టుకుంటారు. కానీ టిడిపి మహానాడు ఎందుకు నిర్వహించుకుంది ?

 

సరే మహానాడును ఎన్ని రోజులు నిర్వహించాలన్నది పూర్తిగా వాళ్ళిష్టమే. కానీ ఈ సందర్భంగా జరిగిన చర్చలు, తీర్మానాలే  విచిత్రంగా ఉన్నాయి.  మహానాడు జరిగిన పద్దతి చూస్తే ప్రభుత్వాన్ని, వ్యక్తిగతంగా జగన్ ను తిట్టటానికే పెట్టుకుంటున్నట్లుంది. చంద్రబాబు మాట్లాడినా, నేతలు మాట్లాడినా ప్రసంగాలు మొత్తం జగన్ చుట్టూనే తిరగటం గమనార్హం. చంద్రబాబును పొగడటం, జగన్ పై బురద చల్లటంతోనే రెండు రోజుల మహానాడు జరిగిపోయింది.  ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపటం తప్పుకాదు. కానీ ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలను కూడా జగన్ కు ఆపాదించేయటమే తప్పు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అరాచకపాలనకు ఏడాది అనే అంశాన్నే తీసుకుంటే అరాచకపాలనంతా ఎల్లోమీడియాలోనే కనిపిస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు, ప్రతిపక్షాలు ఎల్లోమీడియాలో బురద చల్లిస్తున్నాయి. ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నా అవంతా వ్యక్తిగత స్ధాయిలో గ్రూపు తగాదాలే ఎక్కువ. కాబట్టి చంద్రబాబో లేకపోతే ఎల్లోమీడియా చెబుతున్నట్లు ప్రజాస్వామ్యమేమీ ప్రమాదంలో పడలేదు.

 

ఇక అన్నదాత వెన్నువిరవటం గురించి కూడా తప్పుడు ఆరోపణలు, కథనాలే రాయిస్తున్నారు. రైతుభరోసా పథకంతో ఏడాదికి రైతులకు డబ్బులు నేరుగా వాళ్ళ ఖాతాల్లో వేస్తోంది ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే రెండుసార్లు డబ్బులు వేశారు. దీనికి ఎలాగూ కేంద్రం నుండి అందుతున్న డబ్బులు అదనంగా అందుతోంది. అలాగే పంటలకు మినిమం సపోర్టింగ్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. కరోనా వైరస్ సంక్షోభంలో కూడా పంటలను పొల్లాల దగ్గరకే వెళ్ళి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అన్నదాత వెన్ను విరిగిందంటే అది చంద్రబాబు హయాంలోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. అన్నదాత ఇబ్బందు పడ్డాడంటే చంద్రబాబు పాలనలో అవస్తలు పడ్డాడు.

 

సాగునీటి ప్రాజెక్టులు సంక్షోభంలో పడిందన్నది కూడా అవాస్తవమే. ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయం తగ్గించటం కోసమే రివర్స్ టెండిరంగ్ అమల్లోకి తెచ్చాడు జగన్. కరోనా సంక్షోభం కారణంగానే పోలవరం తదితర ప్రాజెక్టుల పనులు నెమ్మదించాయి. మళ్ళీ ఇపుడు ఊపందుకునే అవకాశాలున్నాయి. సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది, ఏటిఎంలుగా వాడుకున్నది ఎవరో అందరికీ తెలిసిందే. ఇక ఆక్రమ కేసులు-ఆస్తుల విధ్వంసం కూడా తప్పే. వ్యక్తిగత గొడవలతో ఎక్కడైనా ఆస్తుల విధ్వంసం జరిగితే జరిగుండవచ్చంతే.

 

అయితే జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగానో లేకపోతే ప్రభుత్వాన్ని నిందించటానికి, బురద చల్లటానికే మహానాడు పరిమితం కాకుండా ఆత్మ పరిశీలన కూడా చేసుకునుంటే బాగుండేది. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణాలేమిటి ? సీనీయర్లు దాదాపు ఎందుకు ఓడిపోయారనే విషయాలపైన కూడా చర్చ జరగాలని పట్టుబట్టినా చర్చలు జరగలేదు. తమలోని లోపాలను, తాము చేసిన తప్పులపై చర్చించుకుని వాటిని కరెక్టు చేసుకున్నపుడే పార్టీ బలోపేతమవ్వటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇటువంటి మహానాడులు ఎన్ని జరుపుకున్నా ఉపయోగం ఉండదని చంద్రబాబు గ్రహించాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: