కరోనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ ను కేంద్రప్రభుత్వం మరికొంత కాలం పొడిగించబోతోందా ? అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  మార్చి 24వ తేదీన మొదలైన లాక్ డౌన్ ఇప్పటికి నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుంది. తాజాగా నాలుగో విడత లాక్ డౌన్లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక సడలింపులు ఇచ్చింది. అయితే లాక్ డౌన్లకు ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్న కొద్దీ జనాలు రోడ్లపైకి రావటం పెరిగిపోతోంది.  దాదాపు 65 రోజులుగా ఇళ్ళకే పరిమితమై పోయిన జనాలను ఎక్కువ రోజులు బయట తిరగకుండా కట్టడి చేయటం కష్టమే. జనాల బయటకు రావటం పెరిగిపోతున్న కొద్దీ కేసుల తీవ్రత పెరిగిపోతోంది.

 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు 1.65 లక్షల కేసులు నమోదయ్యాయి. అలాగే సుమారు 4400 మంది చనిపోయారు. గడచిన ఐదు రోజుల్లోనే దాదాపు 45 వేల కేసులు నమోదవ్వటం ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. సగటున రోజుకు 6 వేల కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వాలు గర్తించాయి.

 

వైరస్ తీవ్రత పెరిగిపోతున్న కారణంగా మళ్ళీ కొద్దిరోజుల పాటు లాక్ డౌన్ విధించే ఆలోచనలో కేంద్రప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. లాక్ డౌన్ పొడిగింపు, సడలింపుల విషయంలో  రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం స్వేచ్చ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్, సోలన్ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుండి జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

 

దేశంలో అత్యధికంగా 52 వేల కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. తర్వాత తమిళనాడులో సుమారు 10 వేల కేసులు రిజస్టర్ అయ్యాయి. గుజరాత్ తో పాటు చాలా రాష్ట్రాల్లో కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. లాక్ డౌన్లో సడలింపులు ఇస్తుండటంతో  జనాలు కూడా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే జనాలందరూ రోడ్లపైకి వచ్చేస్తున్నారో సోషల్ డిస్టెన్సింగ్ సాధ్యం కావటం లేదు. దాంతో కేసుల సంఖ్య పెరుగుతోంది.

 

ఇపుడు గనుక వైరస్ ను నియంత్రించకపోతే తీవ్రత పెరిగిపోవటం ఖాయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే మళ్ళీ దేశవ్యాప్త లాక్ డౌన్ విధించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. మరి నేరుగా కేంద్రమే ప్రకటిస్తుందో లేకపోతే రాష్ట్రాలతో ప్రకటింపచేస్తుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: