మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపికి జనాలు 151 సీట్ల అఖండ మెజారిటి ఇచ్చారన్నది వాస్తవమే. అయితే గడచిన పదకొండు మాసాల్లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అదే తప్పేమో అని అనుమానించేట్లుగా పరిస్ధితులు తయారయ్యాయి.  చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా మొదటినుండి ఆరోపణలు, విమర్శలు చేస్తున్నట్లుగా జగన్ కు పరిపాలన చేతకాదేమో ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విషయం ఏదైనా ప్రతిపక్షాల నోళ్ళు మూయించినట్లే న్యాయస్ధానాల నోళ్ళు కూడా మూయించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫెయిలవ్వటమే కాకుండా చాలాసార్లు వికటిస్తున్నాయి. దాంతో చాలా అంశాల్లో హైకోర్టు నుండి జగన్ కు అక్షింతలు తప్పటం లేదు.

 

గడచిన పదకొండు మాసాల్లో చాలా విషయాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు ఆక్షేపించింది. మచ్చుకు ఓ మూడు కేసులను స్టడీ చేద్దాం. మొదటిది తాజాగా ఎన్నికల కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తు ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు కొట్టేసింది. నిమ్మగడ్డను తొలగించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు చెల్లదని స్పష్టంగా చెప్పింది. నిజానికి నిమ్మగడ్డను తొలగించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదని కొందరు అధికారులు జగన్ కు చెప్పినట్లు సమాచారం. అయితే జగన్ వాళ్ళ సలహాను పట్టించుకోలేదు. స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేస్తు నిమ్మగడ్డ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం తప్పే. అయితే ఆ తర్వాత జగన్ తీసుకున్న అన్నీ నిర్ణయాలు తప్పులే.

 

అలాగే పంచాయితీ భవనాలకు పార్టీ రంగులు వేయాలన్న జగన్ నిర్ణయం కూడా తప్పే. పంచాయితీ భవనాలంటే ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తికి పార్టీ రంగు ఎలా వేస్తారు ? గతంలో కాంగ్రెస్, టిడిపి కూడా తమ పార్టీల రంగులు వేసింది వాస్తవమే. కానీ అప్పుడెవరూ కోర్టుల్లో కేసులు వేయలేదు. కానీ ఇపుడు వైసిపి రంగులు వేయటాన్ని కోర్టులో అభ్యంతరం చెప్పారు కాబట్టి కోర్టు జోక్యం చేసుకుంది. పార్టీ రంగు వేయవద్దని కోర్టు చెప్పినా జగన్ సర్కార్  పట్టించుకోలేదు. చాలా చిన్న విషయమే ఇపుడు పెద్దదయిపోయి చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టులో చేతులు కట్టుకుని నిలబడాల్సొచ్చింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జనాలు వైసిపికి 151 సీట్లు ఇచ్చింది వాస్తవం. అంతమాత్రాన ప్రభుత్వం ఏకపక్షంగా ఏమి చేసినా చెల్లుబాటవుతుందని జగన్ అనుకుంటే చాలా తప్పు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమీక్షించే అధికారం కోర్టులకు ఉంటుందన్న విషయాన్ని జగన్ మరచిపోయాడు. వైసిపి నేతల అభిప్రాయంలో తమ చంద్రబాబుతో పాటు ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా కూడా పూర్తిగా వ్యతిరేకం. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తు వేస్తున్న పిటీషన్లను కోర్టులు సమీక్షకు తీసుకుంటున్నాయి.

 

అధికారంలోకి రాకమునుపే ఈ విషయాలన్నీ వైసిపి నేతలకు, జగన్ కు బాగా తెలుసు. తాను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాలు చేస్తు ఇబ్బంది పెడతారన్న విషయాన్ని జగన్ ముందుగానే ఊహించాలి. అప్పుడేమి చేయాలంటే తన నిర్ణయాన్ని ఎవరు కూడా తప్పు పట్టేందుకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటిది తనకు 151 ఎంఎల్ఏల బలం ఉంది కాబట్టి ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని అనుకుంటే పొరబాటే అని జగన్ గ్రహించాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: