వైసిపి ఎంపి విజయసాయిరెడ్డికి జనసేన నేత నాగుబాబు మద్దతు పలికాడా ?  అంటే పార్టీ పరంగా కాదులేండి. చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ నేతల మానసిక పరిస్ధితిపై ఇంతకాలంగా విజయసాయి ఎటువంటి అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నాడో అటువంటి అభిప్రాయాలనే నాగాబాబు కూడా తాజాగా వెలిబుచ్చాడు. అంటే చంద్రబాబు, టిడిపి విషయంలో సాయిరెడ్డికి నాగుబాబు మద్దతుగా నిలబడినట్లే కదా.  ఇంతకీ నాగుబాబు తాజాగా వెలిబుచ్చిన అభిప్రాయం ఏమిటంటే ’భవిష్యత్తులో టిడిపి అధికారంలోకి రాదన్నది నా గట్టి నమ్మకం’  అని ట్విట్టర్లో కుండబద్దలు కొట్టాడు.

 

’ఏపిలో వైసిపి తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీ జేఎస్పేనా లేకపోతే బిజేపీనా అన్న విషయాన్ని కాలమే నిర్ణయించాల’ని చెప్పాడు. అయితే ’ఎవరు అధికారంలోకి వచ్చేది చెప్పలేకపోయినా టిడిపి రాద’న్న విషయం చెప్పగలనన్నాడు. టిడిపి హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో ఊడబొడిచిందేమీ లేదన్నాడు. జరిగిన అభివృద్ధంతా టిడిపి అనుకూల టీవీల్లో, పత్రికల్లో మాత్రమే అని చెప్పటం గమనార్హం.

 

సరే టిడిపి హయాంలో జరిగిన అవినీతితో పాటు అనేక అంశాలపై ట్విట్టర్లో నాగుబాబు విరుచుకుపడ్డాడు. చివరలో ’మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని, మాదే రాజ్యమనే భ్రమల్లో నుండి బయటపడమని’ కూడా సలహా ఇచ్చాడు. ’భ్రమల్లో నుండి బయటకు రామని, పగటి కలలు కంటూనే ఉంటామని అనుకునే వాళ్ళని మానసిక శాస్త్రంలో ’హెలూసినేషన్స్’  అని అంటార’ని కూడా బిగ్ బ్రదర్ ఎద్దేవా చేశాడు.

అసలు టిడిపి భవిష్యత్తుపై నాగాబాబు ఒక్కసారిగా ఇంతలా ఎందుకు ఫైరయ్యాడు ? ఎందుకంటే మొన్ననే ముగిసిన మహానాడులో బాలకృష్ణ మాట్లాడుతూ 2024 లోపలే టిడిపి అధికారంలోకి వచ్చేస్తుందంటూ చెప్పాడు. గడచిన నాలుగు రోజులుగా  నాగుబాబుకు బాలయ్యకు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ నేపధ్యంలోనే ఎవరి పేరు ప్రస్తావించకుండా  మహానాడులో బాలయ్య వ్యాఖ్యలపై నాగుబాబు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశాడని అర్ధమైపోతోంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇపుడు నాగుబాబు చెప్పిన విషయాలను ఎప్పటి నుండో సాయిరెడ్డి చెబుతున్నాడు. సాయిరెడ్డి తన ట్విట్టర్ వేదికగా ఒకవైపు చంద్రబాబునాయుడును మరోవైపు ఎల్లోమీడియా వైఖరిపైనా ప్రతిరోజు సెటైర్లు వేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. సాయిరెడ్డి పనిలో పనిగా జనసేన అధినేత  పవన్ కల్యాణ్ మీద కూడా సెటైర్లు వేస్తునే ఉన్నాడు.  అలాంటిది చంద్రబాబు, టిడిపి విషయంలో మాత్రం సాయిరెడ్డికి నాగుబాబు పెట్టిన ట్వీట్లు మద్దతుగా ఉండటం  గమనార్హం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: