ఏపీ సీఎంగా జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. మరి ఈ ఏడాది పాలనలో జగన్ ఏం సాధించారు.. అన్న విషయం పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి కావాలని ఆయన ఎందుకు తపించారో ఇట్టే అర్థమవుతుంది. ఆయన ఏడాది పాలన అద్భుతాలమయం అని చెప్పేలేం కానీ.. ఆ పాలనలో ఓ మానవత్వ స్పృహ ఉంది. ప్రజలకు ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసేవాళ్లను నేనున్నాను అంటూ ఆయన ఇచ్చిన భరోసా వెలకట్టలేనిది.

 

 

ఒక్క సారి అవకాశం ఇవ్వండి.. 30 ఏళ్లు సీఎంగా ఉంటా.. మానాన్న ఫోటో పక్కన నాఫోటో కూడా ఉండాలని జగన్ గతంలో పదే పదే చెబితే అది అధికార కాంక్షగా ప్రచారం చేసిన వాళ్లూ ఉన్నారు. కానీ.. అది ప్రజాసేవకాంక్ష అన్న విషయాన్ని జగన్ తొలి ఏడాదిలోనే నిరూపించారు. సామాన్యుడికి పాలన అందాలి.. సామాన్యుడి జీవితంలో మార్పు రావాలి.. అనేదే లక్ష్యంగా జగన్ ముందుకు సాగారు. అందుకు అనుగుణంగా వ్యవస్థలనూ నెలకొల్పారు.

 

 

గ్రామవాలంటీర్, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు.. ఇవన్నీ పేర్లు వేరే కావచ్చు. కానీ ఈ పథకాలన్నింటి వెనుకా మౌలిక సూత్రం జనం ఇంటి ముందుకు పాలన చేరాలి. అతి సామాన్యుడి జీవితంపైనా తన ప్రభావం ఉండాలన్న కాంక్షగానే చెప్పుకోవాలి. ఫించను పెంపు, అమ్మ ఒడి, రైతు భరోసా, వాహనమిత్ర, నేతన్న నేస్తం..ఇలా పథకం పేరు ఏదైనా సరే.. అందులో ప్రతి పేదవాడికీ సాయం అందాలన్న తపనే కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ఏడాది పాలన ఓ మానవత్వ పరిమళం.

 

 

మరి జగన్ ఏడాది పాలనలో లోపాలే లేవా అంటే ఎందుకు లేవు.. అవీ చాలానే ఉన్నాయి. మంకుపట్టు, అనుకున్నది అప్పుడే అయిపోవాలన్న తపన, ఆ తపనలో తప్పటడగులూ ఉన్నాయి. సంక్షేమం విషయంలో నువ్వు సూపరు బాసూ అనిపించుకున్నా... అభివృద్ధి విషయంలో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అనుకున్నంతగా అడుగులు పడలేదు.. ఇలాంటి లోపాలు ఉన్నా.. అవి దిద్దుకునేందుకు సమయమూ ఉంది. ఆ దిశగా జగన్ దూసుకుపోవాలి. అప్పుడే 30ఏళ్ల పాలన కల సాకారమయ్యేది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: