తెలంగాణ‌లో ఇప్పుడు మీడియా అంతా సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా జై కొడుతోంది. ఇక్క‌డ కేసీఆర్‌ను ఎదిరించి.. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఉన్న మీడియా బ‌తికి బ‌ట్ట‌క‌ట్టే ప‌రిస్థితి లేద‌న్న‌ది మీడియా, రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉన్న అభిప్రాయం. కేసీఆర్‌కు కోపం వ‌స్తే ఏం జ‌రుగుతుందో ఆయ‌న తెలంగాణ తొలి సీఎం అయిన వెంట‌నే ఏబీఎన్ ఛానెల్‌, టీవీ 9 ఛానెల్‌కు తెలిసి వ‌చ్చింది. దీంతో తెలంగాణ‌లో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా వెళ్లేందుకు ఏ మీడియా కూడా ముందుకు రావ‌డం లేదు. ఎవ‌రైనా స‌రై కేసీఆర్‌కు జీ హుజూర్ అనాల్సిందే. ఇక గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు కేసీఆర్ పట్ల కాస్తో కూస్తో వ్య‌తిరేకంగా ఉన్న మీడియా అంతా కూడా ఆయ‌న రెండోసారి సీఎం అయ్యాక పూర్తిగా అధికార పార్టీ, కేసీఆర్‌కు మోక‌రిల్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. 

 

రామోజీరావు లాంటి మ‌హామ‌హులే కేసీఆర్ తో రాజీ మార్గంగా ముందుకు వెళుతున్నారు. ఎప్పుడు అయితే టీవీ -9, 10 టీవీల‌ను మై హోం కొనేసిందో అప్ప‌టి నుంచి మెజార్టీ మీడియా, పెద్ద మీడియా అంతా కేసీఆర్ కనుస‌న్న‌ల్లోకి వెళ్లిపోయింది. వీళ్లంద‌రిలోకి కాస్త డిఫ‌రెంటు ఏబీఎన్ రాధాకృష్ణుడు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీకి స‌పోర్ట్ చేసిన ఆయ‌న కేసీఆర్ గెలిచాక కూడా ఏపీలో చంద్ర‌బాబు అండ ఉంద‌నో ఏమోగాని ( అప్పుడు టీడీపీకి తెలంగాణ‌లో కాస్త బ‌లం ఉంది.. 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు) కాస్త కేసీఆర్‌పై దూకుడుగా వెళ్లాడు. ఆ త‌ర్వాత ఛానెల్ బంద్ అయ్యింది. నెల‌ల పాటు పోరాటం త‌ర్వాత తిరిగి ఏబీఎన్ ఛానెల్ ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత కేసీఆర్ - రాధాకృష్ణ జాన్ జిగ్రీ దోస్త్‌ల‌య్యారు. 

 

ఆ త‌ర్వాత ఏబీఎన్ ఆఫీస్ అగ్నికి ఆహుతి అయిన‌ప్పుడు సైతం కేసీఆర్ హైద‌రాబాద్ లో ఉన్న ఆంధ్ర‌జ్యోతి ప్ర‌ధాన కార్యాల‌యాన్ని సంద‌ర్శించి ఫ్రీగా స్థ‌లం ఇవ్వ‌డంతో పాటు ఆఫీస్ క‌ట్టి ఇస్తార‌ని హామీ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. నాడు కేసీఆర్ ఆంధ్ర‌జ్యోతి కార్యాల‌యం సంద‌ర్శించిన‌ప్పుడు కేసీఆర్ - ఆర్కే ఇద్ద‌రూ ఆర్కే ప‌ర్స‌న‌ల్ రూమ్‌లోకి వెళ్లి మాట్లాడుకున్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది. ఇక తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల టైం లో కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేసిన‌ప్పుడు కేసీఆర్ తిరిగి 80కు పైగా సీట్ల‌తో అధికారంలోకి వ‌స్తున్న‌ట్టు కూడా ఆర్కే రాత‌లు రాశారు.

 

ఎప్పుడు అయితే చంద్ర‌బాబు అక్క‌డ ఎంట‌ర్ అయ్యి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారో ఆర్కేతో పాటు బాబు అనుకుల మీడియా అంతా కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు వండి వార్చేసింది. కట్ చేస్తే కేసీఆర్ భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌రుస‌గా రెండోసారి వ‌చ్చారు. ఆ త‌ర్వాత జ్యోతిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. ఇక్క‌డ ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి రావడంతో ఆంధ్ర‌జ్యోతి క‌ష్టాలు మామూలుగా లేవు. యేడ‌ది పాటు కేసీఆర్ అహంభావి అంటూ రెచ్చిపోయిన ఆర్కే రాత‌లు.. వీరంగాలు.. రంకెలు అన్ని చూశాం. తీరా చూస్తే అక్క‌డ జ‌గ‌న్‌, ఇక్క‌డ కేసీఆర్ యాడ్లు ఇవ్వ‌డం లేదు. జ్యోతి క‌ష్టాలు చాలానే ఉన్నాయంటూ ఇన్న‌ర్‌గానే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

 

ఇక తాజాగా కేసీఆర్ ఆరేళ్ల పాల‌న‌ను కీర్తిస్తూ జ్యోతిలో ఫ‌స్ట్ పేజీలో కేసీఆర్ సిక్స‌ర్ అంటూ పాజిటివ్ వార్త వండి వార్చేశారు. నిజానికి కేసీఆర్ సొంత ప‌త్రిక అయిన న‌మ‌స్తే తెలంగాణ కూడా జ్యోతి కీర్త‌న‌ల్లో సాటి రాద‌నేంత‌గా ఆ క‌థ‌నం ఉంది. ఈ రాత‌లు యాడ్స్ కావు... ప్ర‌క‌ట‌న‌లు కావు.. కానీ ఏతావాతా మ‌నం అనుకోవాల్సింది ఏంటంటే స‌యోధ్య క‌థ‌నాలు అని కొత్త పేరు పెట్టుకుంటే మంచిదేమో..?  ఏదేమైనా కేసీఆర్ విష‌యంలో ఆర్కే పాత స‌వాళ్లు ప‌క్క‌న పెట్టేసి కొత్త స‌యోధ్య‌కు దిగుతున్నట్టే అని.. కేసీఆర్ విష‌యంలో త‌న స్టాండ్ పూర్తిగా మార్చుకోక‌పోతే జ్యోతి రాత మారిపోతుంద‌న్న‌ది ఆర్కేకు అర్థ‌మైంద‌న్న చ‌ర్చ‌లు టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: