అవును తాను నిజంగానే భయపడ్డానని స్వయంగా చంద్రబాబునాయుడే చెప్పుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే ’స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాల అభ్యర్ధులను నామినేషన్లు కూడా వేయనీయకుండా ధౌర్జన్యాలు చేసి ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్ధనే కూల్చేయాలని అనుకున్నార’ట. ’దాదాపు 65 కేసుల్లో కోర్టులో జోక్యం చేసుకుని వీళ్ళ చర్యలను కట్టడి చేయకుంటే రాష్ట్రం ఏమై ఉండేదా అని భయమేసింది’ .. ఇది తాజాగా చంద్రబాబు ట్విట్టర్లో వెలిబుచ్చిన ఆందోళన. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్ధానిక సంస్ధల ఎన్నికల నామినేషన్ అంశం వేరు. 65 కేసుల్లో కట్టడి చేసిందని చెప్పటం వేరు.  రెండు వాక్యాలకు అసల సంబంధమే లేదు.  కాకపోతే రెండింటిని కలిపేసి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ట్విట్ చేయటమే విచిత్రం.

 

ఇక ట్వీట్ లో చంద్రబాబు వెలిబుచ్చిన ఆందోళణ ఎంత వరకూ కరెక్టో చూద్దాం. మొదటి అంశం నామినేషన్లు వేయనీయకుండా ధౌర్జన్యాలు చేయటం. ప్రతిపక్షాలను నామినేషన్లు వేయనీయకుండా ధౌర్జన్యాలు జరగటమన్నది రాష్ట్రచరిత్రలో ఇదే మొదటిసారి అన్నట్లుగా చంద్రబాబు కలరింగ్ ఇస్తున్నాడు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా  జరిగేదిదే. టిడిపి అధికారంలో ఉన్నపుడు కూడా ఇటువంటి ధౌర్జన్యాలు చాలానే చేసింది. బహుశా ఆ విషయం చంద్రబాబు మరచిపోయాడేమో ? టిడిపి అధికారంలో ఉన్నపుడు నరసరావుపేట నియోజకవర్గంలో జరిగిన ఓ ఎంపిపి ఉపఎన్నిక సందర్భంగా నామినేషన్ వేయాలని ప్రయత్నించిన వైసిపి నేతలను టిడిపి నేతలు  అడ్డుకుని చావకొట్టిన విషయం అప్పట్లో సంచలనమైంది.

 

చెప్పుకుంటూ పోతే అధికారపార్టీ ధౌర్జన్యాలు చాలానే కనిపిస్తాయి. కాకపోతే ప్రతిపక్షంలోని నేతలు గట్టి వీళ్ళైనపుడు అధికారపార్టీ నేతల ధౌర్జన్యాలు సాగని సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నామినేషన్లు, ధౌర్జన్యాలంటూ భయపడాల్సిన అవసరమే లేదు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో  రెండు వర్గాలు తలపడినపుడు ఘర్షణలు జరగటం మామూలే అన్న విషయం చంద్రబాబుకు తెలీదా ?  ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా గొడవలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి రాష్ట్రంలో.

ఇక  65 కేసుల్లో కోర్టులు వీళ్ళ చర్యలను కట్టడి చేసిందట. ఎన్నికల్లో నామినేషన్ల విషయంలో కానీ ధౌర్జన్యాల విషయంలో కానీ కోర్టులు ఎక్కడా జోక్యం చేసుకోలేదు.  65 కేసుల్లో కోర్టులు జోక్యం చేసుకున్న మాట వాస్తవమే. కానీ అవన్నీ పాలనలో విధానపరమైన నిర్ణయాల  మీదే. ఇందులో కూడా చాలా కేసులు టిడిపినే ఎవరెవరితోనో  ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయించిందనే ప్రచారాన్ని చంద్రబాబు మరచిపోకూడదు. ఇంగ్లీషు మీడియం విషయంలో కోర్టులో కేసు వేసిన బిజెపి నేత సుదీష్ రాంబట్ల టిడిపి అధినేతకు అత్యంత సన్నిహితుల్లో ఒకడు.

 

అలాగే రాష్ట్ర ఎన్నికల కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మద్దతుగా కోర్టుల్లో 20 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ ఉంటే ఏమిటి ? మరొకళ్ళుంటే ఏమిటి ? ఎన్నికల కమీషనర్ పోస్టేమీ జనాలతో రోజు సంబంధాలుంటే పోస్టు కాదు కదా ? అయినా అంతమంది కేసులు వేశారంటేనే వాళ్ళ వెనుక ఎవరున్నారో అందరికీ అర్ధమైపోయింది.  కాబట్టి టిడిపినే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేయించి మళ్ళీ టిడిపినే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు పడుతున్నాయని చెప్పటంలో అర్ధంలేదు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇన్ని కేసులు ఎందుకు పడుతున్నాయనే విషయాన్ని జనాలు అర్ధం చేసుకోలేరా ?  కాబట్టి చంద్రబాబు భయపడాల్సినంతగా రాష్ట్రంలో ఏమీ జరగటం లేదని గ్రహిస్తే చాలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: