తెలంగాణ ఆవిర్భవించి నేటికి ఆరేళ్లు.. ఆరేళ్లలో తెలంగాణ ఎన్నో సాధించింది. ఆధునిక భారతంలో తలెత్తుకుని నిలబడింది. ఈ సందర్భంగా ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే.. తెలంగాణ అంటే వెనుకబాటు, తెలంగాణ అంటే కరవు, తెలంగాణ అంటే అజ్ఞానం అన్న ముద్రలు ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగునా తెలంగాణకు దక్కింది అవమానాలు, ఛీత్కారాలే.

 

 

తెలంగాణ సమాజం ఎదుర్కొన్న వివక్ష అంతా ఇంతా కాదు.. తెలంగాణ వాళ్లకు తెలుగు భాష సరిగ్గా రాదంటూ హేళన చేశారు. తెలంగాణ వాళ్లు మాట్లాడేది తెలుగే కాదన్నారు. తెలంగాణ యాసకు సరైన గౌరవం దక్కలేదు. సినీరంగంలోనూ తెలంగాణకు అనాదరణే. విలన్లకు ఎక్కువగా తెలంగాణ యాస వాడేవారు. తెలంగాణవాళ్ల సంస్కృతి, పండుగలు, ఆచారాలు అన్నీ అవహేళనకు గురయ్యాయి.

 

 

ఇక దీనికి తోడు వెనుకబాటు తనం.. నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో మొదటి నుంచి అణిచివేత కొనసాగింది. అదేమంటే మీ తెలంగాణ అంత ఎత్తున ఉంది.. మీకు నీళ్లు ఎలా వస్తాయని మాట్లాడారు నాయకులు. అది ప్రకృతి మీకు ఇచ్చిన శాపం అన్నారు.. తప్ప.. ఎలా తెలంగాణ పొలాలను నీళ్లతో తడపాలని ఆలోచన చేసిన దాఖలాలు లేవు. మీకు వ్యవసాయం రాదన్నారు. వ్యాపారం రాదన్నారు.. ఇలాంటి అవమానాలెన్నో.

 

 

కానీ తెలంగాణ ఏర్పడిన ఈ ఆరేళ్లలో అవన్నీ పటాపంచలైపోయాయి. ఇప్పడు తెలంగాణ సగర్వంగా తలఎత్తుకు నిలబడింది. గతంలో పంటల్లో వెనుకబడిన తెలంగాణ ఇప్పుడు భారత దేశానికే అన్నం పెట్టేంతగా దిగుబడులు సాధించింది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను కేవలం నాలుగేళ్లలో పూర్తి చేసుకుని గోదావరిని సద్వినియోగం చేసుకుంటోంది. ఐటీ రంగంలోనూ సత్తా చాటుతోంది. తన భాషను, తన యాసను కాపాడుకుంటూ సగర్వంగా నిలబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆనాడు నవ్విన నాపచేసే ఇప్పుడు పండింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: