అన్నదమ్ముల మధ్య ఏమైందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇన్ని రోజులు సినీమా వాళ్ళు మీద, సామాజిక అంశాల మీద మాత్రమే ట్వీట్లు పెడుతున్న బిగ్ బ్రదర్ నాగుబాబు ఒక్కాసారిగా టిడిపి మీద విరుచుకుపడ్డాడు. ట్విట్టర్ వేదికగా నాగుబాబు టిడిపిని ఉద్దేశించి చేసిన నాలుగు  కామెంట్లు వైరల్ గా మారాయి. అసలు హఠాత్తుగా టిడిపిని పరోక్షంగా చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తు నాగుబాబు ఎందుకు విరుచుకుపడ్డాడో అర్ధం కావటం లేదు. నాగుబాబు తాజా వ్యవహారంతో అసలు బ్రదర్స్ మధ్య ఏమి జరుగుతోందో అర్ధంకాక జనసేన జనాలు గందరగోళ పడుతున్నారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవైపు చంద్రబాబుకు మద్దతుగా పవన్ తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టేశాడు. చంద్రబాబును కాపాడటం కోసమే తాను రాజకీయ పార్టీని పెట్టాననేట్లుగా పవన్ రాజకీయాలు చేస్తున్నాడు.  తన  వ్యవహార శైలితో జనాలు కూడా పవన్ అంటే చంద్రబాబు జేబులో మనిషే అనిపించుకుంటున్నాడు. మరి వీళ్ళద్దరి బంధం ఫెవికాల్  అంత స్ట్రాంగ్ ఉన్న విషయం తెలిసి కూడా నాగుబాబు టిడిపిని డైరెక్టుగా ఎలా ఎటాక్ చేశాడు ? అన్నదే అర్ధం కావటం లేదు.

 

భవిష్యత్తులో వైసిపి తర్వాత అధికారంలోకి జనసేన వస్తుందా లేకపోతే బిజెపి వస్తుందా అని చెప్పలేడట. కానీ తెలుగుదేశంపార్టీ మాత్ర అధికారంలోకి రాదని కచ్చితంగా చెప్పగలనని చెప్పటం మామూలు విషయం కాదు. నాగుబాబుకు నందమూరి నటసింహం బాలకృష్ణకు మధ్య వివాదాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. బాలయ్యతో సమస్య ఉంటే దాన్ని బాలయ్యకే పరిమితం చేయాల్సిన నాగుబాబు మొత్తం టిడిపికి ఎందుకు చుట్టాడో ఎవరికీ అర్ధం కావటంలేదు.

 

ఉరుము లేని పిడుగు లాగ టిడిపి గురించి కామెంట్లు చేయాల్సిన అవసరం బిగ్ బ్రదర్ కు ఏమొచ్చింది ? అన్నదే పెద్ద ప్రశ్న.  పైగా నాగుబాబు చేసిన కామెంట్లు ఇంతకాలం చంద్రబాబు, టిడిపి గురించి వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి చేస్తున్న కామెంట్ల లాగే ఉన్నాయి.  తేడా ఏమిటంటే సాయిరెడ్డేమో నేరుగానే చంద్రబాబు పేరు పెట్టి కామెంట్లు చేస్తున్నాడు. నాగుబాబు మాత్రం తన కామెంట్లలో ఎక్కడా చంద్రబాబు పేరు ప్రస్తావించలేదు.  ఏదేమైనా జనసేనలో ఉంటూ పేరు ఎత్తకపోయినా చంద్రబాబు, టిడిపి గురించి నెగిటివ్ కామెంట్లు పెట్టమంటే మామూలు విషయం కాదు.

ఆమధ్య నాగుబాబు పెట్టిన రెండు మూడు ట్వీట్లపై నెటిజన్లు, సోషల్ మీడియాలో రివర్సయ్యింది. దాంతో పవన్ కల్పించుకుని నాగుబాబు పెట్టిన ట్వీట్లతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించాడు.  తాను పెట్టిన ట్వీట్లకు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్వయంగా సోదరుడే ప్రకటన చేయటంతో నాగుబాబు గాలి తీసేసినట్లయ్యింది. దాంతో నాగుబాబుకు బాగా మండిందని సమాచారం. దాంతో తమ్ముడి మీద కోపమంతా ఇపుడు నాగుబాబు టిడిపి మీద చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  మరి తాజా  కామెంట్ల పర్యవసానం ఎలాగుంటుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: