చివరి నిముషంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయ్యింది. కరోనా వైరస్ తీవ్రత, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో తుపాను ప్రభావం వల్లే అమిత్ షా బిజీ అయిపోవటంతో ఆఖరు నిముషంలో అపాయిట్మెంట్ రద్దు చేసినట్లు సమాచారం.  అదే సమయంలో బిజెపి నేతలు కొందరు అమిత్ షా పై ఒత్తిడి తెచ్చి మరీ జగన్ అపాయిట్మెంట్ రద్దు చేయించినట్లు ఎల్లోమీడియా ప్రచారం మొదలుపెట్టేసింది.   కారణం ఏదైనా సరే జగన్ కు అపాయిట్మెంట్ ఇవ్వటం తర్వాత రద్దు చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇదే పద్దతిలో మూడుసార్లు రద్దయ్యింది. జగన్ ఢిల్లీకి చేరుకున్న తర్వాత కూడా అమిత్ షా కలవని సందర్భాలున్నాయి.

 

సరే ఇక ఎల్లోమీడియా ప్రకారం రాష్ట్రంలో బిజెపి నేతలెవరో చెబితే జగన్ కు అపాయిట్మెంట్ రద్దు చేశారని అచ్చేసింది.  అంటే పార్టీ నేతలు చెప్పగానే అపాయిట్మెంట్ రద్దుచేసేంత బలహీన స్ధితిలో హోంమంత్రి ఉన్నాడా అని అనుమానం వస్తోంది. ఎందుకంటే జగన్ అపాయిట్మెంట్ కోరింది వైసిపి అధ్యక్షుడిగా కాదు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నాడు. జగన్ కు అపాయిట్మెంట్ ఇచ్చినా, నిరాకరించినా ప్రభుత్వం దృష్టిలోనే చూడాలి. ఉద్దేశ్యపూర్వకంగా అపాయిట్మెంట్ నిరాకరిస్తే ఏపిని అవమానించటమే కానీ జగన్ కు ఏమీ కాదు. బిజెపి నేతలు, ఎల్లోమీడియా ఇదే కోరుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

పైగా ఎల్లోమీడియా చెప్పిన కారణాలు కూడా చాలా సిల్లిగా ఉంది. ఎన్నికల కమీషన్ (మాజీ) కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫిర్యాదు, ప్రభుత్వ వ్యతిరేక పోరు చేస్తున్న కారణంగా జగన్ న్ను కలవద్దని కొందరు కమలనాదులు చెప్పగానే జగన్ కు అమిత్ షా అపాయిట్మెంట్ రద్దు చేశాడట. పైగా విచిత్రమైన వాదన ఏమిటంటే జగన్ ను కలిస్తే ఏపిలో పార్టీ ఎదుగుదల కష్టమని చెప్పారట. జగన్ ను కేంద్ర హోం మంత్రి కలిసినా, కలవకపోయినా రాష్ట్రంలో బిజెపి పరిస్ధితి ఏమిటో అందరికీ తెలిసిందే.

 

ప్రభుత్వంపై పోరులో బిజెపి నేతలు చాలా ముందున్నారు కాబట్టి పార్టీ బలోపేతమైపోతోందని బిజెపి నేతలు అనుకుంటుంటే అంతకన్నా పెద్ద జోక్ మరోటుండదు. జగన్ ఓ వైపు సంక్షేమ పాలనతో జనాల్లో దూసుకుపోతుంటే ఏమి చేయాలో అర్ధంకాక బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు దిక్కుతోచటం లేదు. అందుకనే చంద్రబాబునాయుడు ఏమి చెబితే అలా ఆడుతున్న విషయం అందరికీ తెలిసిపోయింది.

 

కన్నా వ్యవహారశైలిపై పార్టీలోని నేతలే కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాబట్టి రాష్ట్రంలో బిజెపి బలపడేది కల్ల మాత్రమే. అమిత్ షా అపాయిట్మెంట్ ఉద్దేశ్యపూర్వకంగా నిరాకరిస్తే తప్పు చేసినట్లే అనుకోవాలి.  ఇటువంటి చేష్టల వల్ల, రాతల వల్ల అందరి ముందు పార్టీ మరింత పలుచనవుతుందే కానీ బలోపేతమయ్యే అవకాశమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: