మానవత్వం ఏమయ్యింది..? మనుషులు మృగాలుగా ఎందుకు మారుతున్నారు..? మానవత్వం చచ్చిపోయిందా..? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ పోతే ఆ ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నలాగే మిగిలిపోతుంది. ప్రపంచమంతా కరోనాతో అల్లకల్లోలం అవుతుంటే ఓ పక్క దుశ్చర్యలు దారుణాలు.. మరోపక్క హత్యలు అల్లర్లు. మొన్న జార్జ్ ఫ్లాయిడ్ హత్య రూపంలో, నిన్న గర్భం దాల్చిన ఏనుగుని చంపిన రీతిలో, నేడు గాంధీ విగ్రహానికి జరిగిన అవమానంలో కట్టలు తెగుతున్న రాక్షసత్వం ఉట్టి పడుతుంది.

 

కాలం ముందుకు సాగుతున్నా నవ యువ ఆవిష్కరణలతో ప్రపంచం ముందుకు దూసుకుపోతున్నా.. రంగు రూపం అనే తేడాలను పక్కన పెట్టి అందరూ కలిసి సెక్యులర్ విదివిదానాలతో కలిసి పని చేస్తున్నా ఇంకా కూడా మానవులకి మతం కులం రంగు రూపం అనేవి పెద్ద సవాళ్లే.. పైగా దీనికి తోడుగా అధికారం కల్పించిన హక్కులు, సమాజం కల్పించిన నైతిక హక్కులు అస్త్రాలుగా మారి తీరిగి మానవత్వం పైనే తమ ప్రతాపం చూపుతున్నాయి. ఇందుకు నిదర్శనం మొన్న జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య. జార్జ్ ఫ్లయిడ్ మెడ పై కాలు పెట్టి అగ్రరాజ్య పోలీసులు చేసిన దుశ్చర్య ప్రపంచాన్నంతా ఎంతగానో కలచివేసింది. ఈ హత్య ఎన్నో అల్లర్లకు దారి తీసింది నిరసనకారులు కట్టలు తెగిన ఆవేశంతో ఇళ్లని వాహనాలని స్టోర్లని తగలబెట్టి పెను విద్వసాన్నే సృష్టించారు. ఈ అల్లర్ల వల్లా ఎందరికో ఆస్తి నష్టం వాటిల్లింది. మన దేశ సంతతికి చెందిన ఓ వ్యాపారి హోటల్ ని తగలబెట్టిన సంగతి తెలిసిందే. జార్జ్ ఫ్లాయిడ్ కి అన్యాయం జరిగితే అల్లర్లు చేశారు.. మరి ఆ అల్లర్లలో నష్టం జరిగిన యజమానులకి ఎవరు అన్యాయం చేసినట్టు..? ఆగ్రా రాజ్య పోలీసులా నిరసనకారులా..? ఇరు వర్గాలు తమ హక్కులని అస్త్రాలుగా చేసుకొని మానవత్వంపై సమాజం పైనే దాడికి దిగారు.   

 

ఇక ఈ విషయం ఇలా ఉంటే వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయానికి ముందున్న గాంధీ విగ్రహానికి తీరని అవమానం జరిగింది. ఉక్రోషంతో రగిలిపోతున్న నిరసనకారులు కార్యాలయం బయట ఉన్న గాంధీ విగ్రహం పై రంగులు చల్లారు.. అంతటితో ఆగకుండా విగ్రహ రూపాన్ని చెడగొట్టారు.. ఈ చర్య ఎంతవరకు సమంజసం..? నిరసనలు ఎక్కడికి దారి తీస్తున్నాయి.. శాంతి అహింస భోదించిన మహాత్ముల విగ్రహాలపై ఇలాంటి ఘటనలు చేయడం ఎంతవరకు సబబు..? ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులని చెడగొట్టి పరిస్థితులని అదుపులోకి తీసుకొచ్చారు వెంటనే విగ్రహాన్ని కవర్ తో చుట్టి కేసు దర్యాప్తు చేసుకున్నారు.

 

జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి వ్యతిరేకంగా నిరసనకారులు చేస్తున్న హింసాత్మక ఘటనలు, విధ్వంసాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని అమెరికాలోని భారత రాయబారి కెన్‌ జస్టర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారుల చేష్టలతో 'వాషింగ్టన్‌ డీసీలో ఉన్న గాంధీ విగ్రహానికి జరిగిన అవమానానికి చింతిస్తున్నాం. దీనిపై క్షమాపణలు కోరుతున్నాం. వివక్ష, పక్షపాతవైఖరికి వ్యతిరేకంగా మేము కట్టుబడి ఉన్నాం. తొందరలోనే వీటి నుంచి బయటపడతాం' అని కెన్‌ జస్టర్‌ ట్విటర్‌లో ప్రకటించారు. ఇది కేవలం భారత జాతికే కాదు యావత్ ప్రపంచానికే అవమానం అని నెటిజన్లు ఎందరో తమతమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిరసన అనేది మానవ నైతిక హక్కు ప్రశ్నించడం మన హక్కు.. హక్కులని ఆసరాగా తీసుకుని నియమాలను ఉల్లంఘించి వ్యవహరిస్తే ఆ నిరసనలే విధ్వంసాలుగా మారుతాయి.. ఆ విద్వాంసాలూ తీరిగి సమస్యలను తలపెడతాయి.. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న అల్లర్ల తీరు ఇలానే ఉంది ఇది చాలా బాధాకరం మరియు దురదృష్టకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: