మెల్లి మెల్లిగా అధికార వైసిపిలోని సీనియర్ల గొంతులు పైకి లేస్తున్నాయి. తమలో అణగారిన అసంతృప్తిని మెల్లిగా బయటకు వినిపిస్తున్నారు. రెండు రోజుల్లో ముగ్గురు సీనియర్లు బాహాటంగానే ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను బయటకు చెప్పారంటూ మామూలు విషయం కాదు. వీళ్ళు నలుగురు చేసిన ఆరోపణలు ఇసుక కొరత, అభివృద్ధి కార్యక్రమాల జరగటం లేదన్న విషయాలపైనే కావటం గమనార్హం. వీళ్ళు చెప్పిన దాంట్లో అబద్ధాలు ఏమీ లేకపోవటంతో ఆరోపణలపై ఏ విధంగా స్పందించాలో పార్టీలోని వారికి ఎవరికీ అర్దం కావటం లేదు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఇసుక కొరత జనాలను పట్టి పీడిస్తోందంటూ నరసాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు, వినుకొండ ఎంఎల్ఏ బొల్లా బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన మీటింగ్ లో ఆరోపణలు చేశారు. వీళ్ళు చేసిన ఆరోపణలతో  అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అలాగే నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ఇసుక దొరకలేదనే ఆరోపణలకు తోడు అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని కూడా ఆరోపించాడు.

 

వీళ్ళ ముగ్గురు చేసిన ఆరోపణల్లో ప్రధానంగా జిల్లా యంత్రాంగం సరిగా పనిచేయటం లేదనే కామన్ పాయింట్ కనబడుతోంది. ఇసుక కొరత విషయంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. వినుకొండలోని ఇసుక రీచుల దగ్గర లోడుతో బయలుదేరుతున్న ట్రాక్టర్లు, లారీలు వినుకొండకు చేరుకునేటప్పటికి మాయమైపోతున్నాయంటూ బొల్లా చేసిన ఆరోపణ చిన్నది కాదు. బాహాటంగా చెప్పకపోయినా ఇసుక కొరత కృత్రిమ సృష్టేనని, బ్లాకులో అమ్మేసుకుంటున్నారని అందరికీ అర్ధమైపోతోంది. మరి ఇదే ఆరోపణలను తెలుగుదేశంపార్టీ నేతలు కూడా చేస్తున్నారు కదా. వాళ్ళు చేస్తున్న ఆరోపణలు తప్పెలాగవుతాయి ?

 

ఇసుక కొరత ఎక్కడా లేదని లక్షల క్యూబిక్ మీటర్లు అందుబాటులో ఉందని అడిగిన వాళ్ళకు అడిగినట్లుగా ఇస్తున్నట్లు అధికారులు ఒకవైపు చెబుతున్నారు. అదే సమయంలో ప్రజాప్రతినిధులేమో అవసరమైన వాళ్ళందిరికీ ఇసుక అందటం లేదంటూ మండిపడుతున్నారు. వినుకొండ రీచుల్లో ఇసుకతో బయలుదేరిన లారీలు నియోజకవర్గం కేంద్రానికి వచ్చేసరికి దోసెడు కూడా ఉండటం లేదని బొల్లా చేసిన ఆరోపణలకు అధికారులు ఏమని సమాధానం చెబుతారు ? ఇసుక కావాలని తనను ఓ డాక్టర్ అడిగితే కూడా ఇప్పించలేకపోయినట్లు ఎంపి చెప్పింది అబద్ధమేనా ?  తమ ప్రభుత్వంపైనే ఆరోపణలు చేసుకోవాల్సిన అవసరం అధికారపార్టీ వాళ్ళకు ఏముటుంది ?

 

కాబట్టి ఇసుక కొరతుందన్న విషయం వాస్తవమే అని అనిపిస్తోంది. ఇసుక లభ్యత కూడా కావాల్సినంత ఉందన్నదీ వాస్తవమే అయ్యుండచ్చు. డిమాండ్ కు తగ్గట్లుగా ఇసుకుంటే మరి అవసరమైన వాళ్ళందరికీ ఇసుక ఎందుకు అందటం లేదన్నదే ప్రధాన ప్రశ్న. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వెంటనే దృష్టి సారించకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే చంద్రబాబునాయుడు పరిపాలన గబ్బుపట్టిన కారణాల్లో ఇసుక కొరత, అవినీతి కూడా ఒకటని గ్రహించాలి. ఇప్పటికైనా  జగన్ జోక్యం చేసుకుని అవసరమైనందరికీ ఇసుక వెంటనే అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే పాలనలో చంద్రబాబుకు జగన్ కు పెద్ద తేడా ఏమీ లేదంటారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: