కరోనా వైరస్ కిట్లు, రక్షణ పరికరాలు అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది అన్నట్లుగా నర్సీపట్నం డా. సుధాకర్ మీడియా ముఖంగా వ్యాఖ్యానించడంతో, ఆయనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ తరువాత రకరకాల కారణాలతో ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఆ తరువాత రోడ్డుపై పబ్లిక్ కి ఇబ్బంది కలిగించే విధంగా ఆయన వ్యవహరించారనే కారణంతో పోలీసులు డాక్టర్ సుధాకర్ ను అరెస్టు చేశారు. ఇక్కడివరకు కథ ఒకలా ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసి దాని ద్వారా లబ్ధి పొందాలని చూసిన టీడీపీ మధ్యలోకి రావడంతో కథ మొత్తం వేరేలా మారింది.

 

తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లడంతో.. దీనిపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశం ఇచ్చింది. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా, ఈ వ్యవహారంలో డా. సుధాకర్ తప్పు కూడా ఉందని, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి రావడమే కాకుండా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి వారిని దూషించడం, వంటి వాటికి ఆయన పాల్పడ్డారు అనే సాక్షాలను సీబీఐ సంపాదించింది. దీంతో సీబీఐ ఆయనపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దీంతో ఒక్కసారిగా మళ్ళీ కథ మారిపోయింది.

 

తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచినట్టు... డా. సుధాకర్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా వైసీపీ ప్రభుత్వంపై ఎదురు దాడి చేద్దామని భావించిన టీడీపీ పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. డా. సుధాకర్ వ్యవహారంలో అతిగా స్పందించామనే అభిప్రాయం ఇప్పుడు టీడీపీ నాయకుల్లో మొదలైంది. మొన్న జరిగిన టీడీపీ మహానాడులో కూడా సుధాకర్ వ్యవహారాన్ని పదేపదే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఈ కేసు ఖచ్చితంగా తమకు లాభం చేకూరుస్తుందని అంచనా వేయగా సీబీఐ రంగంలోకి దిగడంతో మొత్తం ఈ వ్యవహారం అంతా రివర్స్ అయిందని, ఈ విషయంపై ఇక సైలెంట్ గా ఉంటేనే బెటర్ అన్న ఆలోచనతో టీడీపీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: