మీడియా రంగంలో ప్రింట్ మీడియాదే మొదటి నుంచి ఆధిపత్యం. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత కూడా ప్రింట్ తన హవా కొనసాగించింది. కాస్త జోరుకు అడ్డుకట్టపడినా మొత్తానికి తన ఆధిపత్యం మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే ఇక ఇప్పుడు ప్రింట్ మీడియాకు మంచి రోజులు లేవన్న సంగతిని అంతా గుర్తిస్తున్నారు.

 

 

అదే సమయంలో డిజిటల్ మీడియాకు క్రేజ్ పెరుగుతోంది. డిజిటల్ మీడియా అంటే వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు, బ్లాగులు వంటివన్నమాట. ఈ డిజిటల్ మీడియా మొదట్లో ప్రింట్ మీడియాకు పూరకంగా పని చేసేది. అంటే ప్రింట్ మీడియాలో రాలేని వార్తలు ఎక్కువగా డిజిటల్ మీడియాలో వస్తుండేవి. కానీ క్రమంగా డిజిటల్ మీడియా కు ప్రాధాన్యం పెరిగిపోయింది.

 

 

ఇప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు దీటుగా డిజిటల్ మీడియా రాణిస్తోంది. అంతే కాదు.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా డిజిటల్ రూపంలోకి మారడం మొదలుపె‌ట్టాయి. ఇప్పుడు ప్రతి పత్రికకూ, ప్రతి ఛానల్ కూ తమకంటూ వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు సైతం తమ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై ఆదాయం సంపాదిస్తున్నాయి. మరో కీలకమైన విషయం ఏంటంటే.. గతంలో డిజిటల్ మీడియాకు అంత గౌరవం కూడా ఉండేది కాదు.. ఏదో గాసిప్స్ రాసుకుంటారులే.. అన్నీ అభూత కల్పనలు అన్న అభిప్రాయం ఉండేది.

 

 

డిజిటల్ మీడియా కూడా అలాగే ఉండేది. కానీ.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల హవా తగ్గడంతో డిజిటల్ మీడియా కూడా తనను తాను మార్చుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు పాఠకులు కూడా డిజిటల్ మీడియాను సీరియస్ గా తీసుకుంటున్నారు. మొన్నటి విజయ్ దేవరకొండ, నిన్నటి వైసీపీ ఎంపీ.. ఓ వెబ్ సైట్ వార్తపై ఫిర్యాదు చేయడం పెరుగుతున్న డిజిటల్ మీడియా ప్రాధాన్యానికి ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: