ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీలో రోజురోజుకు ఏదో ఒక అసంతృప్తి బయటకు వస్తోంది. వాస్తవంగా చూస్తే పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన అప్పటినుంచి చంద్రబాబు ను, పార్టీని న‌మ్మి పార్టీలో ఉండేందుకు టిడిపి ఎమ్మెల్యేలు కూడా ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే పార్టీని ప్రక్షాళన చేసి కార్యకర్తల్లో నమ్మకం కలిగించేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడు గా ఉన్నా కళావెంకట్రావు ను మార్చి ఆయన స్థానంలో మరో నేతకు ఈ పగ్గాలు అప్పగించాలన్న చ‌ర్చ‌లు తెర మీదకు వస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి ఎన్నికల్లో ఓడిపోయిన క‌ళానే ఇంకా అధ్య‌క్షుడిగా కొన‌సాగించ‌డం క‌రెక్ట్ కాద‌ని పార్టీలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ పదవి కోసం పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.

 

ఈ ప‌ద‌విని బీసీ వ‌ర్గాల‌కు చెందిన నేత‌ల‌కే ఇవ్వాల‌న్న అభిప్రాయం అయితే పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వాస్తవంగా చూస్తే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి పై మాజీ మంత్రి, టెక్క‌లి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆశలు పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. అచ్చెన్నాయుడు దూకుడు రాజకీయాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఆయన అయితేనే వైసీపీని అసెంబ్లీలోనూ బయట ఇరుకున‌ పెడతానని పలువురు భావిస్తున్నారు. చంద్రబాబు సైతం ఈ పదవి అచ్చెన్న‌కు ఇస్తే ఎలా ఉంటుందని ఇప్పటికే సన్నిహితుల వద్ద తన అభిప్రాయం వ్యక్తం చేశారట. అయితే చంద్రబాబు తనయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మనసు మాత్రం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వైపు ఉందని తెలుస్తోంది.

 

రామ్మోహన్ నాయుడు కావడంతో పాటు ఢిల్లీ స్థాయిలో పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్నారని.. ఆయన అయితే యువతను ఆకర్షించే విష‌యంలో పార్టీకి యూజ్ అవుతుంద‌ని లోకేష్ భావిస్తున్నారట. ఈ విష‌యంలో పార్టీ స‌న్నిహితుల వ‌ద్ద చంద్ర‌బాబు అచ్చెన్న పేరు చెపుతుంటే.. చిన‌బాబు రామ్మోహ‌న్ పేరు చెపుతుండ‌డంతో పార్టీ వ‌ర్గాల్లో పార్టీ అధ్య‌క్షుడి ఎంపిక విష‌యంలోనే తండ్రి, కొడుకుల మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌ని పెద‌వి విరుస్తున్నార‌ట‌. అదే టైంలో అటు బాబాయ్ అచ్చెన్న‌, త‌న‌యుడు రామ్మోహ‌న్ మ‌ధ్య పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టి నుంచే గ్యాప్ ఉంద‌న్న టాక్ ఉంది. ఇప్పుడు ఈ పార్టీ అధ్య‌క్షుడి విష‌యం వీరి మ‌ధ్య మ‌రింత దూరం పెంచుతుంద‌న్న టాక్ జిల్లా రాజ‌కీయాల్లో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: