ప్ర‌కృతికి ద‌గ్గ‌ర‌గా..కృత్రిమ‌త్వానికి దూరంగా బ‌త‌క‌డం నేర్చుకున్న‌ప్పుడే... జీవ‌న‌శైలిని మార్చుకుంటే తప్పా..మ‌నుగ‌డ లేద‌న్న‌ది నిజం. నీ బ‌తుకు నీవు బ‌తికి చ‌చ్చినా..భావిత‌రాల‌కు మ‌నుగ‌డ లేకుండా చేసిన‌వాడ‌వ‌వుతావ్‌..! అందుకే మారా లోయ్ మ‌నిషి. మార్పుకు శ్రీకారం చుట్ట‌వోయ్‌...నేడే...ఈనాడే.. క‌రోనాకంటే ముందు ఎన్నో ఎన్నెన్నో ప్ర‌మాద ఘంటిక‌లు మోగాయి.. అయినా మ‌నిషి కాలం గ‌తి త‌ప్పుతున్నా ప‌ట్టించుకోలేదు..అడ‌వులు కుంచించుకుపోతున్నా మ‌న ఆక్ర‌మ‌ణ ఆక‌లి చ‌ల్లార‌లేదు. కాలుష్యం మ‌న ఊపిరితిత్తుల‌ను న‌ల్ల‌గా మార్చుతున్నా సోయి లేదు.క‌రువు కాట‌కాలు  కాటేసిన ఖాత‌ర్ చేయ‌లేదు. భూగ‌ర్భ‌జ‌లం పాత‌ళానికి చేరుతున్నా.. ఒక‌ప్ప‌టి న‌దులు ఎండ‌మావులుగా మారినా... మంచుప‌ర్వ‌తాలు క‌రుగుతున్నా.. అకాల వ‌ర్షాలు విరుచుకుప‌డుతున్నా...మ‌నం ఆధునిక మ‌త్తు నుంచి అభివృద్ధి నిషా నుంచి..సౌక‌ర్య‌వంత‌మైన జీవితం నుంచి....ఆయుష్షును కుదించుకుంటున్నామ‌ని లెక్క‌లు చెబుతున్నా..ఎందుక‌నో మ‌నం మార‌లేదు. క‌రోనా వ‌చ్చి కాటేస్తున్నా....ఇంకా మారేందుకు ముందుకు రాకుంటే..భ‌విష్య‌త్ ఉంటుందా..? ఆలోచించోయ్ మ‌నిషి.

 

మానవ నాగరికత విపరీత పోకడల కారణంగానే  కరోనా వైరస్..పుట్టుక‌..వ్యాప్తి జ‌రుగుతున్నాయ‌ని నేడు ప్ర‌పంచం ముక్త‌కంఠంతో అంగీక‌రిస్తోంది. శత్రువైనా కరోనా మనకు నేర్పిన పాఠం ఒక్క‌టే.. అది ప్రకృతికి దగ్గరగా నివసించడం ; కృత్రిమత్వాన్ని తొలగించుకోవడం. వాస్త‌వానికి  పారిశ్రామిక విప్లవం తర్వాత మనిషి ప్రకృతికి దూరం జరుగుతూ వచ్చాడు. అభివృద్ధి, ఆధునిక జీవ‌న విధానం పేరిట జంక్‌ఫుడ్‌ తింటూ, వేగంగా పరిగెడుతూ, ఫ్యాషన్లతో వింత పోకడలు పోతూ, అన్ని విషయాల్లోనూ కృతిమత్వాన్ని ఆపాదించుకున్నాడు.. అదే స‌మ‌యంలో ప్ర‌కృతిని దూరంగా బతికేస్తూ త‌న ఆయుష్షును తానే త‌గ్గించేసుకుంటున్నాడు. ప్రకృతిని కాపాడడం మన తక్షణ కర్తవ్యం.

 

ప్రకృతి ప్రకోపించకుండా చూసుకోవలసిన బాధ్యత మనమీద ఉంది. క‌రోనాకు ముందు...క‌రోనా త‌ర్వాత మాన‌వుడి జీవితంలో మార్పు రావాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. ప్ర‌కృతిపై మ‌నిషి ఆలోచ‌న విధానం మారాలి అప్పుడే  జీవ‌న విధానంలో మార్పు వ‌స్తుంది. త‌ద్వారా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు దోహ‌దం చేస్తుంది. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులారా ఏకం కండి..ప్ర‌కృతిలో మ‌మేక‌మ‌య్యే జీవ‌న విధానాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించండి. ప్ర‌కృతితో క‌ల‌సి జీవిస్తే..దానికి ద‌గ్గ‌రగా ఉంటే పోయేదేమీ లేదు...మ‌హా అంటే మ‌న  ఆయుష్షు పెంచుకోవ‌డం త‌ప్పా..

మరింత సమాచారం తెలుసుకోండి: