మానవత్వం..ఎక్కడుంది ఈ మానవత్వం, గట్టిగా కేకలు పెడితే పరిగెత్తుకు వస్తుందా. గుక్కపెట్టి ఏడిస్తే ఆ కన్నీళ్ళు తుడవడానికైనా వస్తుందా. అసలు మానవత్వం అనేది కాస్తయినా మన మనుషులలో బ్రతికి ఉందా..? సమాజంలో జరిగే కొన్ని దారుణమైన సంఘటనలు చూస్తే ఇదే ప్రశ్న కలుగుతుంది ఎవరికైనా. అలాంటి దారుణమైన ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. ఒక్కటి కాదు రెండు కాదు ప్రసవం కోసం ఏకంగా ఎనిమిది ఆస్పత్రులు తిరిగినా.. ఏ వైద్యుడు ఆస్పత్రిలో చేర్చుకోలేదు. ఫలితంగా ఎనిమిది నెలల గర్భిణీ అంబులెన్సులోనే 13 గంటల పాటు నరకయాతన అనుభవించింది. చివరకు అంబులెన్సులోనే మృతి చెందిన దారుణ ఉదంతమిది.

 

గౌతమ్‌బుద్ధనగర్ జిల్లాలోని కోడా కాలనీలో వీజేందర్ సింగ్, నలీమ్ దంపతులు నివాసముంటున్నారు. నలీమ్ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణీ. అయితే నలీమ్‌ కు ఉన్నట్టుండి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భర్త విజేందర్ సింగ్.. అంబులెన్సులో మొదటగా ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ ఆస్పత్రి సిబ్బంది సరిపడా బెడ్స్ లేవంటూ మరో ఆస్పత్రికి తరలించారు. ఇలా మొత్తం 13 గంటల పాటు ఏకంగా ఎనిమిది ఆస్పత్రులు తిరిగాడు. ఎక్కడా నలీమ్‌ ను చేర్చుకోలేదు. నొప్పులు భరించలేక చివరకు ఆ తల్లి అంబులెన్సులో ప్రాణాలు విడిచింది. అయితే ఈ ఘటనపై మృతురాలు నలీమ్ భర్త వీజేందర్ సింగ్ స్పందిస్తూ.. నా భార్య నొప్పులతో విలవిలలాడిపోతుంటే 13 గంటల్లో ఎనిమిది ఆస్పత్రులు తిరిగామని, ప్రైవేటు ఆస్పత్రులే కాదు, చివరకు ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఆమెను చేర్చుకోలేదన్నారు. 13 గంటల తర్వాత జిమ్స్‌లో చేర్పించానని, అయితే ఆసుపత్రిలో చేర్పించే సమయానికి అంబులెన్స్ లోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరిదీ నిర్లక్ష్యం... ప్రభుత్వాలది కాదా..?. ఎవరు చెప్తారు దీనికి సమాధానం..మనం కాదా..? కాసేపట్లో బిడ్డ పుడతాడని, వాడి భవిష్యత్తు గురించి ఎన్నో కళలు కన్న ఆ తండ్రిని ఎవరు ఓదారుస్తారు..? కట్టుకున్నది కళ్ల ముందే నరకం అనుభవిస్తుంటే అతడి గుండె ఎన్ని సార్లు పగిలిందో మనం ఆలోచించాల్సిన పని లేదా.? అయినా 13 గంటల పాటు ఒక గర్భిణీ నరకయాతన అనుభవిస్తున్నా సరే ఆస్పత్రిలో చేర్చుకునేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదంటే ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమే. మన మీద మనమే సిగ్గుపడాల్సిన నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: