మారం..మేము మాత్రం మారం. యుగాలు మారినా, తరాలు మారినా, చట్టాలు మారినా..మేము మాత్రం మారం. ఆడది కనిపిస్తే చాలు రెచ్చిపోతాం, వయస్సుతో సంబంధం లేకుండా మా ఆకలి తీర్చుకుంటాం. అడ్డం అనుకుంటే చంపేస్తాం. ఇది నేటి సమాజంలోని కొంత మంది మానవ మృగాల వికృతచేష్టలకు ప్రతిరూపం. ఆడదాన్ని దేవతగా పూజించే నా ఈ దేశంలో..ప్రస్తుత సమాజం కనీసం ఆడదాన్ని ఆడదానిగా కూడా చూడలేకపోతుంది. ఎందుకు..? దీనికి కారణం ఏంటి..? ఆడది చేసిన తప్పేంటి..? మొన్న విశాఖలో జరిగిన దివ్య హత్య ఉదాంతం చూస్తుంటే కన్నీటి బొట్టు రాల్చని కన్ను లేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు అనుభవించి చివరకి బతికుండగానే నరకం అనుభవించి అత్యంత దారుణంగా హత్యకు గురైన ఆమె జీవితం మొత్తం విషాదమే..

 

దివ్య స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా. 2015లో ఆమె స్వగ్రామంలో జరిగిన వివాదాల్లో దివ్య తల్లి, సోదరుడు, అమ్మమ్మ దారుణ హత్యకు గురికావడంతో ఆమె అనాథగా మిగిలింది. చిన్న వయస్సులోనే వివాహం కావడంతో దివ్యను కొద్ది రోజులకే భర్త వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అదే ఊరులోని పిన్ని, బాబాయి వద్ద ఉండేది. ఆమె బాబాయికి విశాఖలోని ఎన్‌ఏడీలో నివాసం ఉండే గీత అనే మహిళతో అక్రమ సంబంధం ఉంది. దీంతో దివ్య ద్వారా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించొచ్చని ఆమె ఇచ్చిన సలహాతో బాబాయి‌ దివ్యను గీతకు అప్పగించాడు. అయితే అక్కడ ఇమడలేక దివ్య కొద్దిరోజులకే పారిపోయింది. ఈ క్రమంలోనే నగరంలోని ద్వారకా బస్‌స్టేషన్‌లో ఒంటరిగా తిరుగుతున్న ఆమెకు వసంత పరిచయమైంది. తాను ఆశ్రయం కల్పిస్తానని దివ్యను నమ్మించిన వసంత అక్కయ్యపాలెంలోని తన ఇంటికి తీసుకెళ్లింది. వసంత భర్త దుబాయిలో ఉంటుండటంతో ఆమె ఇక్కడ గుట్టుగా వ్యభిచారం చేసేది. ఈ క్రమంలోనే అందగత్తె అయిన దివ్యను కూడా మాయమాటలతో వ్యభిచారంలోకి దించింది. 8 నెలలుగా దివ్య ఆమె ఇంట్లోనే ఉంటూ వ్యభిచారం ద్వారా డబ్బులు సంపాదిస్తూ నెలనెలా బాబాయి కుటుంబానికి ఎంతోకొంత పంపిస్తోంది.

 

కొంతకాలం తర్వాత నగదు పంపకాల్లో తేడా రావడంతో వసంత, దివ్య మధ్య గొడవలు తలెత్తాయి. తన శరీరంతో వ్యాపారం చేస్తూ తనకే తక్కువ డబ్బులు ఇస్తారా? అని దివ్య నిలదీసింది. ఇకపై మీతో పనిచేయనని, సొంతంగా వ్యభిచారం చేస్తానని దివ్య బెదిరించింది. దీంతో వసంత, మరికొందరితో కలిసి ఆమెను గదిలో బంధించి చిత్రహింసలు పెట్టింది. గుండు, కనురెప్పలు తీసి అందవిహీనంగా మార్చేసింది. కొద్దిరోజుల పాలు అన్నం కూడా పెట్టకుండా కడుపు మాడ్చేంది. ఆమె పెట్టే చిత్రహింసలు తట్టుకోలేకపోయిన దివ్య ప్రాణాలు విడిచింది. దివ్య కరోనాతో చనిపోయిందని చుట్టు పక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసిన వసంత... మృతదేహాన్ని తరలించే విషయంలో దొరికిపోయింది. ఓ అంతిమయాత్ర వాహనం డ్రైవర్ తో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేయగా, అతడికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో గుట్టురట్టయింది. ఎంత కావాలన్నా ఇస్తామనడంతో అతడు భయపడి పోలీసులకు చెప్పేశాడు. వసంతను, ఆమె ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మొత్తం చెప్పేశారు. వసంతతో పాటు దివ్య పిన్ని క్రాంతివేణి, గీత, ధనలక్ష్మి, సంజయ్ మంజులను అరెస్ట్ చేశారు. ఇక, దివ్య మృతదేహానికి విశాఖ కేజీహెచ్ లో పోస్టుమార్టం నిర్వహించగా ఆమె శరీరంపై 33 గాయాలు ఉన్నట్టు గుర్తించారు. మరి దివ్యను ఇంత దారుణంగా చంపిన వారిన ప్రభుత్వం వెంటనే శిక్షిస్తుందా..? సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దిశ చట్టంతో దివ్యకు న్యాయం జరుగుతుందా..? ఇదేమి కొత్త కాదు.. దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. కొన్ని కేసులకు న్యాయం జరిగితే, మరి కొన్ని కేసులు రాజకీయ నాయకుల స్వార్ధపు రాజకీయాల వల్ల పెండింగ్ లో పడ్డాయి. మరి ఈ దివ్య కేసు ఎలా ఉండనుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: