రాజ‌కీయాల్లో వ్యూహానికి ప్ర‌తివ్యూహం కామ‌న్‌. ఎత్తు వేసేవారుంటే.. పైఎత్తు వేసేవారు ఖ‌చ్చితంగా ఉంటా రు. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా ఇదేత‌ర‌హా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. టీడీపీ అధినేత, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబును ఢీ కొట్టాలంటే.. మాట‌ల‌తో కాదు..చేత‌ల‌తో నేన‌ని న‌మ్మిన జ‌గ‌న్ .. ఆదిశ‌గానే అడుగులు వేస్తున్నారు. చీటికీ మాటికీ మీడియా ముందుకు వ‌చ్చే అల‌వాటు లేని జ‌గ‌న్‌.. త‌న చేత‌ల ద్వారానే చంద్ర‌బాబుకు చెక్ పెడుతున్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో కేవ‌లం 23 స్థానాల‌కే ప‌రిమిత‌మైన చంద్ర‌బాబును.. మ‌రో నాలుగేళ్ల‌కు రెండు లేదా మూడు స్థానాల‌కు ప‌రిమితం చేసేలా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

 

తొలి ఏడాది పాల‌న‌ను సంక్షేమ పాల‌న‌గా ప్రారంభించి.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ కార్య‌క్ర‌మాలు, న‌గ‌దు ల‌బ్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన జ‌గ‌న్‌.. ఇప్పుడు రెండో ఏడాది అభివృద్ధికి పెద్ద‌పీట వేస్తున్నారు. అభివృద్ధి ద్వారా ల‌క్ష‌ల మందిస్థానికులకు ఉపాధి ల‌భించేలా అడుగులు వేస్తున్నారు. సముద్ర ఆధారిత వ్యాపారంలో (బ్లూ ఎకానమీ) ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టి మూడు, నాలుగేళ్లలో పూర్తిచేసేలా అడుగులు వేస్తోంది. అలాగే, ఎనిమిది ఆధునిక ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటు ద్వారా మత్స్యరంగంలో అనూహ్య మార్పులు తీసుకురావడానికి రంగం సిద్ధమైంది.

 

2024 సంవత్సరానికల్లా భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ సెజ్‌ గేట్‌వే పోర్టుల నిర్మాణం పూర్తిచేసి కార్గో ఎగుమతులు ప్రారంభించేలా జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు.  ఈ నాలుగు పోర్టుల నిర్మాణానికి ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.  రూ.3,800 కోట్ల అంచనాతో రామాయ పట్నం, రూ.4 వేల కోట్ల అంచనాతో మచిలీపట్నం పోర్టుల సవివర నివేదికలు (డీపీఆర్‌) ఇప్పటికే తయారయ్యాయి.  రూ.3,200 కోట్ల అంచనాతో భావనపాడు పోర్టు సవివర నివేదిక ఈ నెల పదో తేదీకల్లా సిద్ధం కానుంది.  

 

 

నెలరోజుల్లో ఈ నాలుగు పోర్టుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. ఈ పోర్టుల ద్వారా సంవత్సరానికి దాదాపు 400 మిలియన్‌ టన్నుల కార్గో ఎగుమతులు, దిగుమతులు చేసే అవకాశం ఉంది. ఫ‌లితంగా స్థానికుల‌కు ఉపాధి కూడా ల‌భించ‌నుంది. ఇది క‌నుక స‌క్సెస్ అయితే.. ఇక‌, ప్ర‌తిప‌క్షం ఊసుకూడా ఉండే అవ‌కాశం ఉండ‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: