రాష్ట్రంలో తాము అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామ‌ని.. వైసీపీ అధినేతగా రాష్ట్రంలో ప్రజాసంక‌ల్ప యాత్ర చేసిన స‌మ‌యంలో జ‌గన్ చేసిన ప్ర‌క‌ట‌న చాలా మంది మ‌రిచి పోయారు. కానీ, జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత కూడా ఆ విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిపోలేదు. దీనిని మేనిఫెస్టో లో పెట్ట‌క‌పోయినా.. ఆయ‌న మాత్రం దీనిపై తాజాగా క‌స‌ర‌త్తు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. పార్ల‌మెంటు స్థానాలు 25 ఉన్నాయి. ఈ లెక్క‌న జిల్లాల‌ను కూడా 25 చేయాలి. అయితే, రెండు గిరిజ‌న జిల్లాల‌ను ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ ఎప్ప‌టి నుంచో వినిపిస్తోంది.

 

దీంతో మ‌రొక జిల్లా పెరిగి 26కు చేరుకునే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, ఎప్పుడు ? అనే ప్ర‌శ్న గ‌త ఏడాది నుంచి వినిపిస్తున్నా.. క‌రోనా లాక్‌డౌన్ స‌హా స్థానిక ఎన్నిక‌ల వ్య‌వ‌హారం.. ఇసుక కొర‌త.. వంటి కీల‌క స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో జిల్లాల ఏర్పాటు విష‌యం తెర‌మ‌రుగు అయిపోయింది. అయి తే, జ‌గ‌న్ మాత్రం తాను ఇచ్చిన మాట‌ను మ‌రిచిపోయే త‌త్వం ఉన్న నాయ‌కుడు కాద‌నే విష‌యం తెలి సిందే. తాజాగా ఆయ‌న జిల్లాల ఏర్పాటుపై పార్టీలోని కీల‌క స‌ల‌హాదారుల‌తో చ‌ర్చించారు.

 

ప్ర‌స్తుతం జిల్లాల సంఖ్య‌ను పెంచ‌డం ద్వారా.. పాల‌నను మ‌రింత వేగ‌వంతం చేయ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల ‌కు మ‌రింత గా సంక్షేమాన్ని చేరువ చేయొచ్చ‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితిలో వీటిని ఏర్పాటు చేయ‌డం సాధ్యం కాద‌నేది స‌ల‌హాదారుల మాట‌. జిల్లాల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా మ‌రింత మంది సిబ్బంది.. అధికారులు అవ‌స‌రం అవుతారు. అదేస‌మ‌యంలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కూడా ఏర్పాటు చేయాలి. ప్ర‌స్తుతం ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి.

 

ఈ నేప‌థ్యంలో ఎలాగూ.. 2022లో కేంద్ర ప్ర‌భుత్వం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ ప్ర‌క్రియ చేప‌ట్టే అవ‌కాశం ఉంది. అప్పుడు ప‌నిలో ప‌నిగా జిల్లాల ఏర్పాటు చేస్తే.. ఖ‌ర్చు క‌లిసి వ‌స్తుంద‌ని సూచించార‌ని తెలిసింది. దీంతో మ‌రో ఏడాది త‌ర్వాతే.. కొత్త జిల్లాల ఏర్పాటుపై జ‌గ‌న్ దృష్టిపెడ‌తార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: