ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కి ప్ర‌ముఖ సినీ న‌టుడు, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు బంధువు అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మోహ‌న్‌బాబుది సినిమా ఇండ‌స్ట్రీలో విల‌క్ష‌ణ వ్య‌క్తిత్వం. ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేలా మాట్లాడే ఆయ‌న దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌తో ప్ర‌త్యేక‌మైన అనుబంధం క‌లిగి ఉండేవారు. ఎన్టీఆర్ ఉన్న‌న్ని రోజులు మోహ‌న్‌బాబు ఓ వెలుగు వెలిగారు. అయితే ఆయ‌న్ను ప‌ద‌వి నుంచి దింపిన‌ప్పుడు మాత్రం ఎందుకో అనుకున్నంత‌గా బ‌య‌ట‌కు రాలేదు. సైలెంట్ అయ్యారు. అయితే అప్ప‌టికే ఎన్టీఆర్ మోహ‌న్ బాబును రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేయ‌డంతో ఆ ప‌ద‌విలో ఆయ‌న ఆరేళ్ల పాటు కొన‌సాగారు. త‌ర్వాత చంద్ర‌బాబుకు దూర‌మ‌య్యారు. మ‌ధ్య‌లో మ‌ళ్లీ చంద్ర‌బాబు రెండో సారి సీఎం అయిన‌ప్పుడు ఆయ‌న‌కు ద‌గ్గ‌రైన‌ట్టే అయినా వైఎస్ సీఎం అయ్యాక ఆయ‌న కుమారుడు విష్ణుకు, రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుడి కుమార్తె వెరోనికాకు పెళ్లి జ‌ర‌గ‌డంతో అప్ప‌టి నుంచి వైఎస్‌, మోహ‌న్ బాబు కుటుంబాలు మ‌రింత ద‌గ్గ‌ర అయ్యాయి.

 

వాస్త‌వంగా వీరిది ప్రేమ వివాహం అన్న టాక్ ఉన్నా కూడా మోహ‌న్ బాబు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న‌ప్పుడు వైఎస్ క‌డ‌ప ఎంపీగా ఉండేవారు. అప్పుడే వీరిద్ద‌రు కలిసి బంధుత్వం క‌లుపుకోవాల‌ని విష్ణు, వెరోనికా పెళ్లి కి లైన్ క్లీయ‌ర్ చేశార‌ని టాక్. స‌రే ఏదెలా ఉన్నా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన మోహ‌న్ బాబు త‌న కుమారుడు విష్ణుతో క‌లిసి వైసీపీలో చేరారు. వైసీపీ కోసం పెద్ద‌గా ప్ర‌చారం చేయ‌క‌పోయినా ఒక‌టీ అరా ప్రెస్‌మీట్లు అయితే పెట్టారు. అయితే వైసీపీ గెలిచి యేడాది అయ్యాక చూస్తే మోహ‌న్‌బాబుల జ‌గ‌న్ ప‌ట్ల తీవ్ర అసంతృప్తి ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా జగ‌న్ యేడాది పాల‌న పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మోహ‌న్ బాబు క‌నీసం సోష‌ల్ మీడియాలో అయినా శుభాకాంక్ష‌లు చెప్ప‌క‌పోవ‌డాన్ని బ‌ట్టి చూస్తే ప‌లువురు ప‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

 

మోహ‌న్‌బాబు కు టీటీడీ ఇస్తార‌ని అన్నా.. ఆయ‌న నాకు ప‌ద‌వులు వ‌ద్ద‌ని అన్నారు. త‌ర్వాత ఆయ‌న రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌తార‌ని అన్నా ఆ ప‌ద‌వి కూడా రాలేదు. అయితే మ‌ధ్య‌లో మోహ‌న్ బాబు త‌న పిల్ల‌ల‌తో క‌లిసి వెళ్లి ప్ర‌ధాన‌మంత్రి మోడీని క‌లిసి వ‌చ్చారు. ఇది అప్ప‌ట్లో సంచ‌ల‌నం అయ్యింది. అయితే తాను కేవ‌లం మ‌ర్యాద పూర్వ‌కంగానే వెళ్లి మోడీని క‌లిశాన‌ని అన్నారు. మ‌రి మోహ‌న్‌బాబుకు జ‌గ‌న్‌పై ఎందుకు అస‌హ‌నం అంటే ప‌ద‌వి రాక‌పోవ‌డ‌మా ?  లేదా ?  త‌న కాలేజ్‌కు రావాల్సిన ఫీజు బ‌కాయిలు ఇప్ప‌ట‌కీ రాక‌పోవ‌డ‌మా ( వాస్త‌వంగా చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఈ ఫీజు బ‌కాయిలు రాలేద‌నే ఆయ‌న ధ‌ర్నా కూడా చేశారు ) అన్న‌ది అంతు ప‌ట్ట‌డం లేదు. ఇక ఇటీవ‌ల తెలుగుదేశం అనుకూల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కూడా మోహ‌న్‌బాబు కాస్త అసంతృప్తితోనే మాట్లాడారు. మ‌రి మోహ‌న్‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్ ఇష్యూ ఎటు వెళుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: