రాష్ట్రంలో  ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలను జగన్మోహన్ రెడ్డి సర్కార్ దారుణంగా దెబ్బకొట్టిందా ?  క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నేరుగా ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలను  ప్రభుత్వం ఏమీ ఇబ్బందులు పెట్టలేదు కానీ పరోక్షంగా మాత్రం గట్టి దెబ్బే కొట్టింది. అదికూడా ఎలా దెబ్బకొట్టిందంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో సౌకర్యాలు మెరుగుపరచటం, ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం, ఆధునిక విద్యా విధానాలను అమలు చేయటంతో ప్రైవేటు స్కూళ్ళపై దెబ్బ పడినట్లే అనుకోవాలి.

 

చంద్రబాబునాయుడు హయాంలో ప్రభుత్వ స్కూళ్ళను దెబ్బకొట్టి ప్రైవేటు యాజమాన్యాలకే దోచిపెట్టాడనే ఆరోపణలకు కొదవే లేదు. దానికితోడు నారాయణ స్కూళ్ళ యజమాని నారాయణ స్వయంగా మంత్రిగా ఉండటం ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావే విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో ఆరోపణలు ఆకాశమంతగా లేచాయి. అలాగే చైతన్యా విద్యాసంస్ధల యజమాని చైతన్యరాజు కూడా టిడిపిలో ఉన్నాడు. ఇక ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడు కేశవరెడ్డి మొమోరియల్ స్కూల్ యజమాని. ఇలా చెప్పుకుంటూపోతే ప్రైవేటు యాజమాన్యాల్లో చాలా వరకూ టిడిపి నేతలవో లేకపోతే మద్దతుదారులవే ఉండేవి.

 

ఎప్పుడైతే టిడిపి ముద్రపడిందో ప్రైవేటు విద్యాసంస్ధల యాజమాన్యాలది ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది ఐదేళ్ళు. అలాంటిది జగన్ అధికారంలోకి రాగానే వాళ్ళందరికీ కష్టాలు మొదలయ్యాయి. అనుమతులు లేకుండా సంవత్సరాల తరబడి నడుస్తున్న స్కూళ్ళపై ప్రభుత్వం  కేసులు పెట్టి  మూయించేసింది. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌళిక సదుపాయల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ’మనబడి నాడు-నేడు’ అనే పథకంలో భాగంగా మౌళిక సదుపాయాలు ఏర్పాటుకు రూ. 3832 కోట్లు ఖర్చుకు రెడీ అయ్యింది.

 

మొదటి దశలో 15,715 స్కూళ్ళల్లో  పిల్లలు కూర్చోవటానికి వీలుగా తరగతి గదుల్లో బెంచీలు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, స్కూళ్ళల్లో బాత్ రూములు, బ్లాక్ బోర్డులు, మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచటం, ఇంగ్లీషు ల్యాబులు, కంప్యూటర్లు, ప్రతి స్కూలుకు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మొత్తం 44, 512 స్కూళ్ళలో సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం 10 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. మొదటి విడతగా నిధులు కూడా విడుదలైపోయాయి. రేపు ఆగష్టులో స్కూళ్ళు తెరిచేనాటికి మొదటి విడత స్కూళ్ళలో టేకప్ చేసిన పనులన్నీ దాదాపు అయిపోవాలన్న టార్గెట్ పెట్టుకున్నది. ఇదే సమయంలో ఇంగ్లీషుమీడియం కూడా ప్రవేశపెడుతోంది.

 

కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇటువంటి సౌకర్యాలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఎప్పుడైతే జగన్ స్కూళ్ళపై ప్రత్యేక దృష్టి పెట్టాడో వెంటనే  ప్రభుత్వ స్కూళ్ళలో చేరే విద్యార్ధుల సంఖ్య పెరిగిపోయింది. దానికితోడు అమ్మఒడి, విద్యాదీవెన లాంటి అనేక పథకాలు కూడా అమలు చేస్తుండటంతో ప్రైవేటు స్కూళ్ళలో చదివే విద్యార్ధులు కూడా ప్రభుత్వ స్కూళ్ళలోకి మారిపోతున్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్ళకు అదనంగా 5 లక్షల మంది విద్యార్ధులు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఈ 5 లక్షల మంది విద్యార్ధులు కూడా ప్రైవేటు స్కూళ్ళల్లో చేరేవారే అనటంలో సందేహం లేదు. అంటే ఏ మేరకు ప్రైవేటు స్కూళ్ళకు జగన్ నిర్ణయం వల్ల దెబ్బపడిందో అర్ధమైపోతోంది. అంటే ఇన్ డైరెక్టుగా టిడిపిపైన పడిన దెబ్బగానే అనుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: