పరువు..అసలు దీంట్లో ఏముందో తెలియదు కానీ, మనిషి మాత్రం దీనికోసం తెగ ఆరాటపడిపోతాడు. దీని కోసం ఎంత దారుణానికైనా ఒడిగడతాడు. ఈ మూడు అక్షరాల పదం కోసం జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు కొందరు మూర్ఖులు. దీనికోసం ఒకడు కట్టుకున్న దాన్ని చంపితే, మరొకడు తన కడుపున పుట్టిన దాన్ని చంపుతాడు. అవసరమైతే కన్న దాన్ని కూడా  చంపుతారు. అడ్డం వస్తే ఎవడినైనా చంపుతారు. అంతలా ఈ పదం మనిషి నర నరాల్లో పేరుకుపోయింది. ఇప్పుడంటే మనుషుల్ని ఆ కరోనా వైరస్ వణికిస్తుంది గానీ.. వాస్తవానికి ఈ సమాజాన్ని ఎప్పటినుంచో వణికిస్తున్న అసలైన వైరస్ లు కులం, మతం, పరువు, అహం.. ఇలా చాలానే ఉన్నాయి. కాకపోతే ఇవి మనందరికీ అవసరం కాబట్టి వీటిని మనం అలా గుర్తించలేదు.. అయితే తాజాగా ఒక రాక్షసుడు, ఈ మూడు అక్షరాల పదం కోసం తన ముద్దుల కూతురిని కడతేర్చాడు....

 

గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని కల్లుకుంట్ల గ్రామానికి చెందిన దివ్య అనే యువతి కర్నూలు పట్టణంలోని ఓ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. తోటి విద్యార్థి అయిన నిమ్న కులానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయంలో ఇంట్లో తెలిసి ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగాయి. ప్రేమ వ్యవహారాలు మానుకోవాలని తల్లిదండ్రులు కూతుర్ని హెచ్చరించినా.. ఆమె వాటిని పట్టించుకోకుండా అతడితో ప్రేమాయణం నడిపింది. అయితే లాక్‌ డౌన్‌ కు రెండు రోజుల ముందు ఆ యువతి కర్నూలు నుంచి ఇంటికి వచ్చేసింది. ఈ నేపధ్యం శనివారం (జూన్ 6) ఆమె అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. యువతిని పరిశీలించిన వైద్యులు ఆమెను 13 వారాల గర్భవతిగా నిర్ధారించారు. వైద్యులు చెప్పిన విషయంతో షాక్ కి గురైన తల్లిదండ్రులు అబార్షన్ చేసుకోవాల్సిందిగా ఆమెను ఒత్తిడి చేశారు. అందుకు ఆ యువతి నిరాకరించింది. తాను ప్రేమిస్తున్న యువకుడితోనే పెళ్లి జరిపించాలని తల్లిదండ్రులతో వాదించింది. దీంతో వారు ఆమెను తీసుకొని ఇంటికి వచ్చేశారు.

 

శనివారం రాత్రి భోజనం తర్వాత.. కూతురిని హత్య చేయాలని ప్లాన్‌ వేసిన తల్లిదండ్రులు అర్థరాత్రి సమయంలో కుమార్తె గాఢనిద్రలో ఉండగా, ఆమెపై దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా, అలాగే గొంతునొక్కి హత్య చేశారు. అనంతరం తమ కుమార్తె అనారోగ్యంతో మృతి చెందినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు. అయితే మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన బంధువులు కొంతమంది పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో దంపతులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించగా.. వారు తమ నేరాన్ని అంగీకరించారు. తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమించడం, అబార్షన్ చేసుకోవాలని కోరితే నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు దంపతులిద్దరూ పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. నాకు ఇక్కడ అర్ధం కాని విషయం ఏంటంటే.. పరువు పోతుందేమోనన్న భయంతో.. పరువు మీద ఉన్న తీపితో అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురిని చంపేశారు. మరి కన్న కూతురిని చంపి జైలుపాలైనందుకు పరువు పోదా..?

మరింత సమాచారం తెలుసుకోండి: