తెలుగు దేశం పార్టీ.. స్వర్గీయ శ్రీ నందమూరి రామారావుచే స్థాపించబడి, దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ. తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం పుట్టుకొచ్చిన పార్టీ. ఎందరో రాజకీయ నాయకులకు ఇది పుట్టినిల్లు. ఇదంతా నిన్నటి మాట. ప్రస్తుతం ఈ పార్టీ పరిస్థితి చూసుకుంటే.. తెలంగాణలో కనుమరుగైందనే చెప్పాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇది ఎవరి వైఫల్యం..? పార్టీ అధినేతతా..? నాయకులదా..? అనే ప్రశ్న టీడీపీ నాయకులు ఎవరికి వారు సంధించుకోవడం మంచిది. ఎందుకంటే అధినేత చంద్రబాబు పుత్రవాత్సల్యంతో, తన కొడుకు రాజకీయ భవిష్యత్తుపై ఆరటంతో పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చారు అనేది నగ్న సత్యం. నిజంగా చెప్పాలంటే నారా లోకేష్ సీఎం స్థాయి వ్యక్తి కాదు. ఈ విషయం ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు.. అయినా నోరు మెదపరు. కారణం.. లోకేష్ అధినేత కొడుకు కాబట్టి.

 

అధినేత కొడుకు కాబట్టి ఏ పదవైన చేపట్టొచ్చు అని అనుకుంటే పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారుతుంది. ఇప్పుడు పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది అనుకోండి. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందిన తర్వాత.. అసలు ఈ పార్టీలో ఉండేవారు ఎవరు.. పోయేవారు ఎవరు అనే విషయం ఎవరికీ అర్ధం కావట్లేదు. ఇప్పటికే చాలామంది నాయకులు పక్క పార్టీల్లోకి చేరుతున్నారు. మరికొందరు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా బాబు మాత్రం మారట్లేదు.. తన కొడుకుని అందలం ఎక్కించాలని ఆశ పడుతున్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నారా లోకేష్ ని తమ భవిష్యత్తు నాయకుడిగా క్యాడర్ కూడా ఊహించుకోలేకపోతుంది. ఇదంతా చంద్రబాబుకి తెలియదు అని కాదు, కానీ కొడుకు భవిష్యత్తు కోసం తప్పట్లేదు అని వినికిడి. చంద్రబాబు గనుక తన వైఖరిని మార్చుకోకపోతే.. పార్టీలో తండ్రీకొడుకులు తప్ప వేరే ఎవరు మిగిలేలా లేరు. ఇదంతా చూస్తుంటే.. నందమూరి వారు స్థాపించిన పార్టీ నారా వారి చేతుల్లో భూస్థాపితం అవ్వడం ఖాయం అన్నది విశ్లేషకుల మాట. మరి తమ పార్టీని బ్రతికించుకోవడానికి నందమూరి వారసులు ఏం చేస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: