ఏపీలో అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీలకు అనుకూల మీడియాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఆ మీడియా సంస్థలు సొంత పార్టీకి భజన చేయడం, ప్రత్యర్ధి పార్టీపై విమర్శలు చేయడం చేస్తుంటాయి. అలాగే సొంత పార్టీలో ఏ మాత్రం సత్తా లేకపోయినా సరే పైకి లేపడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాయి. ప్రస్తుతం ఓ టీడీపీ అనుకూల మీడియా కూడా అదే పనిలో బిజీగా ఉంది. తాజాగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

 

ఆయన తనయుడు సుధీర్ కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక శిద్ధా వైసీపీలోకి వెళ్లిపోవడంతో దర్శిలో టీడీపీకి దిక్కులేకుండా పోయింది. శిద్ధా 2014లో దర్శి నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బాబు...శిద్ధాకు ఇష్టం లేకపోయినా సరే ఒంగోలు పార్లమెంట్ బరిలో నిలుచోబెట్టారు. ఇటు దర్శిలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావుని పోటీ చేయించారు.

 

అయితే బాబు ప్లాన్ ఏది వర్కౌట్ కాలేదు. అటు శిద్ధా, ఇటు కదిరిలు ఓటమి పాలయ్యారు. ఇక కదిరి ఓడిన దగ్గర నుంచి పార్టీకి దూరంగా ఉంటూ ఇటీవల వైసీపీలోకి వెళ్ళిపోయారు. తాజాగా ఏమో శిద్ధా కూడా వైసీపీలోకి వచ్చేశారు. ఇలా ఇద్దరు నేతలు టీడీపీని వీడటంతో దర్శిలో టీడీపీకి దిక్కులేకుండాపోయింది. అయితే ఈ పరిస్తితిల్లో కూడా టీడీపీ అనుకూల మీడియా దర్శిలో తమ్ముళ్ళు తొణకడంలేదని చెప్పి కథనం ఇచ్చి కాస్త హడావిడి చేసింది. దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీకి చెందిన ముఖ్యులెవ్వరూ శిద్దాను అనుసరించలేదని, ఏదో అయిదారుగురు నేతలు మాత్రమే శిద్ధాతో పాటు వెళ్లారని, మిగతా వారు వైసీపీలో చేరాలన్న ఆసక్తిని ప్రదర్శించలేదని చెప్పింది.

 

వాస్తవానికి టీడీపీ అనుకూల మీడియా చెప్పిన విధంగా దర్శిలో పరిస్థితిలు లేవు. అసలు ఓడిపోయాకే చాలామంది ద్వితీయశ్రేణి నేతలు వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ నాయకత్వానికి జై కొట్టారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కదిరి వైసీపీలోకి వెళ్ళాక...ఆయనతో పాటు కొందరు తమ్ముళ్ళు జంప్ అయిపోయారు. ఇక ఇప్పుడు శిద్ధాతో పాటు కొందరు తమ్ముళ్ళు నడవడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే కరోనా నేపథ్యంలో శిద్ధా హడావిడి లేకుండా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అవకాశాన్ని బట్టి మిగతా దర్శి తమ్ముళ్ళు వైసీపీలో చెరోచ్చని తెలుస్తోంది. ఇలా దర్శిలో టీడీపీ పూర్తిగా వీక్ అయిపోయినా సరే...ఆ అనుకూల మీడియా తమ్ముళ్ళు తొణకడం లేదని చెప్పి పైకి లేపే ప్రయత్నం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: