తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కేంద్రం ఫోకస్ పెట్టిందా..? న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకొని వారికి చెక్ పెట్టబోతుందా..? తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ ఉనికిని చాటాలని చూస్తుందా..? ఇప్పుడు జాతీయ స్థాయిలో జ‌రుగుతున్న చ‌ర్చ ఇది. ఎందుకంటే..

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణ‌య‌మూ న్యాయ‌స‌మీక్ష‌లో నిల‌బ‌డ‌డం లేదు. ఇప్పటికి దాదాపు 64 కేసుల్లో ఒక్క‌టి కూడా ప్ర‌భుత్వానికి అనుకూలంగా రాలేదు. దీంతో జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేతలకు ఇదొక ఆయుధంగా మారింది. దీంతో జగన్ సర్కార్ ని బహిరంగంగానే నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రభుత్వ కార్యాల‌యాల‌కు రంగుల విష‌యం, ఇంగ్లీషు చ‌దువులు, పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల పంపిణీ, నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం ఇలా చూసుకుంటే ఎన్నో.. అన్నిట్లోనూ జగన్ సర్కార్ కి కోర్టుల్లో ఎదురు దెబ్బతగిలింది. అంతేకాదు.. ప్ర‌భుత్వం అప్పులు తేవాల‌న్నా.. భూములు విక్ర‌యించాల‌న్నా.. ఇలా ఏ నిర్ణ‌యంపైనైనా.. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వ్య‌తిరేక‌త వ‌స్తోంది. అలాగ‌ని న్యాయ‌వ్య‌వ‌స్థ ఉన్న‌తిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టట్లేదు.

 

పోనీ.. ఈ ప‌రిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ కే ఉందా.. అంటే అలా లేదు. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై ప్ర‌భుత్వాన్ని హైకోరు ఎన్ని పిల్లిమొగ్గ‌లు వేయించిందో చూస్తేనే ఉన్నాం. దీంతో ఏకంగా అక్క‌డ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌నే ర‌ద్దు చేసేశారు. అలాగే శ‌వాల‌కు కూడా కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని హై కోర్టు ఆదేశించింది. ఇలా న్యాయ‌వ్య‌వ‌స్థ త‌న‌ప‌ని తాను చేస్తోంది. కానీ, చిత్ర‌ విచిత్రమైన విష‌యం ఏంటంటే.. ఒక్క బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోనే ఇలాంటి వివాదాలు తెర‌మీదికి వ‌స్తున్నాయ‌ని.. జాతీయ మీడియా వెల్ల‌డించింది.

 

మరి ఈ పరిస్థితులు రావడానికి ముఖ్య కారణం ఏంటి అని ఆలోచిస్తే.. న్యాయవ్యవస్థలను అడ్డంపెట్టుకొని తాము అధికారంలో లేని రాష్ట్రాల్లోని ప్రభుత్వాల మీద ప్రజలకు విశ్వాసం పోయేలా చేసి, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలన్నది కేంద్రం పెద్దల వ్యూహం. ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని రాష్ట్ర నాయకులను సూచించారట. ఇలాచేస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని వారు భావిస్తున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఏది ఏమైనా వ్యవస్థలను మ్యానేజ్ చేయడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి కొత్తేం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: