ఇఎస్ఐ కుంభకోణంలో బిగ్ వికెట్ డౌన్ అవ్వగానే రెండో వికెట్ ఎవరు ? అన్న విషయమై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇఎస్ఐ తరపున కొన్న మందులు, వైద్య పరికరాలు తదితరాల్లో భారీ అవినీతి జరిగినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంటు దర్యాప్తులో బయటపడింది. దాంతో తాము సంపాదించిన ఆధారాలన్నింటినీ ప్రభుత్వానికి అందించారు. ఆ ఆధారాలనే ప్రభుత్వం ఏసిబికి అందించి మరింత లోతుగా దర్యాప్తు చేయమని ఆదేశించింది. దాని ఫలితంగానే  ఉత్తరాంధ్రలో కీలక నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టెలీ హెల్త్ సర్వీసెస్ అనే కంపెనీకి నామినేటెడ్ పద్దతిలో అవసరమైన కొనుగోళ్ళు జరపమని అప్పటి మంత్రి అచ్చెన్న ఒత్తిడి తెచ్చారనేది ప్రధానమైన ఆరోపణ. ఐదేళ్ళలో రూ. 935 కోట్లకు జరిపిన కొనుగోళ్ళల్లో  రూ. 150 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసిబి ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన మందులు, వైద్య  పరికరాలను 50 నుండి 130 శాతం అధిక ధరలు చెల్లించినట్లు ఆధారాలున్నట్లు ఏసిబి చెబుతోంది. అవసరం లేకపోయినా కోట్ల రూపాయల కొనుగోలు చేసినట్లు కూడా తమ దర్యాప్తులో తేలిందని ఏసిబి చెప్పింది.

 

అంతా బాగానే ఉంది కానీ తెరమీద కనిపించే అచ్చెన్నాయుడు కాకుండా తెర వెనుక నుండి వ్యవహారాన్ని నడిపించిన వ్యక్తి ఎవరు ? అన్నదే ఆసక్తికరంగా మారింది. తెర వెనుక నుండి మొత్తం వ్యవహారాన్ని నడిపించిన వ్యక్తి మరో మాజీ మంత్రిగా ప్రచారం ఊపందుకుంది. మరి ఆ రెండో మాజీ మంత్రి ఎవరు ? అన్న విషయంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటి వరకు అచ్చెన్నతో కలుపుకుని ఆరుగురిని ఏసిబి అరెస్టు చేసింది. అరెస్టులు ఇక్కడితో అయిపోయాయా ? లేకపోతే ఇంకా ఉన్నాయా ? అన్నది కూడా సస్పెన్సుగా మారింది.

 

ఏదేమైనా అచ్చెన్న అరెస్టు మామూలు విషయం కాదు. ఎందుకంటే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కింజరాపు కుటుంబం టిడిపిలో చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి శ్రీకాకుళంలో కంజరాపు కుటుంబానికి తిరుగన్నదే లేదనే చెప్పాలి. మొదట్లో కింజరాపు యర్నన్నాయుడు ఏమి చెబితే అదే వేదం టిడిపిలో. ఆయన మృతి తర్వాత తమ్ముడు అచ్చెన్నాయుడు కూడా అటువంటి హవానే కంటిన్యు చేస్తున్నాడు. ఇపుడు యర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు కూడా శ్రీకాకుళం ఎంపి అవటంతో పార్టీపై కుటుంబం పట్టు మరింతగా పెరిగింది.

 

ఇటువంటి పరిస్ధితుల్లో 2014-19 మధ్య అచ్చెన్న అపరిమితమైన అధికారాలను చెలాయించాడు. దాని ఫలితమే ప్రస్తుత ఇఎస్ఐ కుంభకోణం. తెరపైన అచ్చెన్న కనిపిస్తున్నా తెరవెనుక మరో కీలకమైన మాజీ మంత్రి  ఉన్నాడనే ప్రచారం పెరిగిపోతోంది. మరి ఆ మాజీ మంత్రి ఎవరు అన్నదే తేలాలి.  అచ్చెన్నతో పాటు మరో ఆరుగురు అధికారులను కూడా ఏసిబి అరెస్టు చేసింది. కాబట్టి దర్యాప్తులో మరో కీలక నేత ఎవరనే విషయం బయటపడుతుందనే అందరూ అనుకుంటున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: