సహాయం చేయాలనే గుణం ఉంటే చాలు... ఆస్తి పాస్తులు, హోదా, పలుకుబడి ఇవేమీ ఉండనవసరంలేదు అని కొంతమంది నిరూపిస్తూ ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తి  యడ్ల యాదిరెడ్డి. ఇతను చెప్పుకోవడానికి పెద్ద సెలబ్రెటీ ఏమీ కాకపోయినా, ఇతను చేసిన పని ఇప్పుడు అతడిని సెలెబ్రెటీని చేసింది. గుళ్ల దగ్గర జరిగే అన్నదానాల దగ్గర నుంచి ఎన్నోసహాయ కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆలయాలకు లక్షల్లో సొమ్ములు విరాళాలుగా ఇస్తూ, అన్నదానాలు, గోశాలలకు విరాళాలు ఇస్తూ, దేవుళ్ళకు కిరీటలు చేయిస్తూ ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు  చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటాడు యాదిరెడ్డి. లక్షల్లో సొమ్ములు ఖర్చుపెట్టి ఇతగాడు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఇతడు ఖచ్చితంగా కోటీశ్వరుడు అనుకుంటే పొరపాటే. గుళ్లకు ఈ స్థాయిలో సహాయం చేస్తున్న ఈ యాదిరెడ్డి అదే గుళ్ల దగ్గర బిక్షాటన చేసే ఒక సదా సీదా వ్యక్తి. కేవలం యాచక వృత్తి ద్వారా వచ్చిన సొమ్ములనే కూడబెట్టి గుళ్లకు విరాళంగా ఇస్తున్న ఇతని గొప్ప మనసుని మెచ్చుకోవల్సిందే. విజయవాడలో యాచక వృత్తిలో ఉన్న ఈయన సొంత ప్రాంతం తెలంగాణలోని నల్గొండ జిల్లా చింతపల్లి.  

 

తనకు దిక్కు మొక్కు ఎవరూ లేకపోవడంతో పదేళ్ల వయసులోనే విజయవాడ వచ్చేసిన యాదిరెడ్డి సుమారు 40 ఏళ్లపాటు రైల్వేస్టేషన్ కేంద్రంగా రిక్షా కార్మికుడుగా జీవనం కొనసాగించాడు. ప్లాట్ ఫామ్ నే తన నివాసంగా భావించి అక్కడే ఉండిపోయాడు. బ్రహ్మచారిగా మిగిలిపోయిన యాదిరెడ్డి ఆ తర్వాత రిక్షా తొక్కే ఓపిక  లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటన చేపట్టాడు. విజయవాడ ముత్యాలంపాడు కోదండ రామాలయం వద్ద యాచక వృత్తి చేసేవాడు. ఆ తర్వాత అదే ప్రాంతంలోని షిరిడీ సాయిబాబా మందిరం వద్దకు మారాడు. భిక్షాటన ద్వారా సొమ్ములు రావడంతో పాటు తిండి, బట్ట, ఆలయం వారే సమకూరుస్తూ ఉండడంతో భక్తులు ఇచ్చిన సొమ్ములను బ్యాంకులో దాచుకోవడం మొదలు పెట్టాడు. 


ఆ తర్వాత ఓసారి అనారోగ్యం పాలవ్వడంతో  వైద్యులు ఎంతోకాలం బతికే అవకాశం లేదని చెప్పడంతో, తాను పూర్తిగా కోలుకుంటే బాబా ఆలయానికి లక్ష రూపాయలు విరాళం ఇస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్టు గానే ఆయన ఆరోగ్యం కుదుట పడడంతో తాను చెప్పినట్టుగానే, తాను దాచుకున్న సొమ్ము ఆలయ నిర్వాహకులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రోజు తమ ముందు భిక్షాటన చేస్తూ ఉండే యాదిరెడ్డి అదే గుడి కి లక్ష రూపాయలు విరాళం ఇస్తాను అంటే ముందుగా ఎవరూ నమ్మలేదు. కానీ చెప్పినట్టుగానే ఆ సొమ్ముతో తెచ్చి ఇవ్వడంతో ఆలయ నిర్వాహకులు షాకయ్యారు. 


ఇక ఆ తరువాత ఆ సొమ్ముతో ఆలయ ప్రాంగణంలో దత్తాత్రేయ విగ్రహం ఏర్పాటు చేయగా, అప్పుడు 20,000 సొమ్మును ఇవ్వడంతోపాటు, ఆలయంలో నిర్వహించే అన్నదానానికి మరో 20,000 సమకూర్చాడు. ఇక ఆలయంలో గురుపౌర్ణమి కి ఒక లక్ష ఎనిమిది వేల కొబ్బరికాయలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదిరెడ్డి ఒక్కొక్క కొబ్బరి కాయకు ఒక్కో రూపాయి చొప్పున లక్ష 8 వేలు విరాళంగా ఇచ్చాడు. ఆ తరువాత ఆలయ సమీపంలోనే గోశాల నిర్మాణానికి మరో మూడు లక్షలు విరాళంగా అందించారు. దీంతో ఆ గోశాలకు దాతగా యాదిరెడ్డి పేరును పెట్టారు. 


ఇక ఆ తరువాత కోదండ ఆలయ నిర్వాహకుల కోరిక మేరకు లక్ష రూపాయల ఖర్చుతో సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడులకు వెండి కిరీటం చేయించాడు. ఇక ఆ తర్వాత కనకదుర్గమ్మ బెజవాడలో తనకు భిక్ష పెట్టింది అనే అభిప్రాయంతో శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో నిత్య అన్నదాన పథకానికి లక్ష 116 విరాళంగా ఇచ్చాడు. ఈ విధంగా ఆయన ఇప్పటి వరకు ఎనిమిది లక్షలకు పైగా సొమ్ములు దేవుళ్లకు, దేవాలయాలకు విరాళంగా ఇచ్చి దేవుళ్ళకి దాతగా మారాడు. తాను ఇప్పటికీ భిక్షాటన నమ్ముకున్నానని, తనకు వచ్చిన మొత్తాన్ని మళ్లీ దేవుళ్లకు విరాళంగా ఇస్తాను అని యాదిరెడ్డి చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: