చచ్చిన పాముని ఎందుకండీ మళ్ళీ మళ్ళీ చంపుతారు.. అనే ఈ ఫేమస్ డైలాగ్ అందరికీ తెలిసే ఉంటుందిలేండి.  అచ్చం ఇలానే ఉంది టీడీపీ అగ్ర నేతల పరిస్థితి. ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేశారు. ఎవ్వరు ఊహించని రీతిలో నిన్న సీబీఐ ఎంక్వైరీ వేసిన జగన్ సర్కార్… 24గంటలు గడిచే లోపే అచ్చెన్నను అరెస్ట్ చేసింది. దీనిపై టీడీపీ అధినేతతో సహా, ఆ పార్టీ నేతలంతా తీవ్రంగా స్పందించారు. కులాన్ని అడ్డుపెట్టుకొని కొంతసేపు హై డ్రామా నడిపారు. అయినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. ఈ వ్యవహారం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుదేమోనని వణికిపోతున్నారు...

 

ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నారా లోకేష్ గురించి తన ట్విట్టర్ వేదికగా మరో బాంబ్ పేల్చారు. దీంతో ఇటు టీడీపీ కార్యకర్తల నుంచి అటు సీనియర్ నేతల దాకా అందరికీ మైండ్ బ్లాక్ అయింది. సందర్భం వచ్చినప్పుడల్లా, వీలుకుదిరినప్పుడల్లా తన ట్విట్టర్ ఫ్రెండ్ లోకేష్ ని పలకరించడానికే ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారు విజయసాయి రెడ్డి. లోకేష్ ఏ ట్వీట్ పెట్టినా, ఏ కామెంట్ చేసినా వెంటనే విజయసాయినుంచి బలమైన కౌంటర్ పడుపోతుంటుంది. ఎందుకో కానీ వారిది ఒక రాజకీయ ట్విట్టర్ బంధం అని చెప్పక తప్పదు. అలాంటి లోకేష్ పై విజయసాయి పేల్చిన బాంబు ఏంటంటే.. “చిట్టినాయుడు దెబ్బ – అచ్చెన్న అబ్బా… టీడీపీ అధ్యక్ష పదవికి ఎర్రన్న కుటుంబం పోటీకి వస్తోందని 900 కోట్లు మందుల కనుగోళ్ల కుంభకోణంలో కీలక డాక్యుమెంట్లను లీక్ చేసిన చిట్టినాయుడు టీం. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేయించడం.. వాటాలు పంచుకోవడం.. అడ్డం అని అనుమానం రాగానే లీకులిచ్చి ఇరికించటం. అచ్చెన్నా… ఎవరెవరు వాటాలు పంచుకున్నారో ఏసీబీకి వెళ్లడించాలి” అని ఆరోపించారు. అంటే అచ్చెన్నాయుడు అరెస్టుకు పరోక్ష కారణం లోకేష్ అని చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి. దీంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు గందరగోళంలో పడ్డారు.

 

అయితే విజయసాయి రెడ్డి ట్వీట్ పై చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ.. అసలు ఈ యాంగిల్లో ఏ విశ్లేషకుడూ ఊహించి ఉండకపోవచ్చని కామెంట్లు పెడుతున్నారు. నిజమే మరి, దీంట్లో కొంచమైన వాస్తవం అనేది ఉండాలి కదా ఊహించడానికి అని మరికొందరు దానికి కౌంటర్ గా పెడుతున్నారు. ఏది ఏమైనా ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగలి. అలాగే ఈ ట్వీట్ ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుందో.. అసలు దీనిపై లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: