ఏపీ సీఎం జగన్ ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్నాడు.. తొలి ఏడాది సమయం పూర్తి చేసుకున్నాడో లేదో దూకుడు బాగా పెంచేశాడు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ కేసులో అరెస్టు చేసేశారు. అటు అనంతపురం జిల్లాలో మరో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అరెస్టయ్యాడు. ఈ పరిణామాలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. రేపు ఎవరికి ఎలాంటి గతిపడుతుందో అన్న భయాందోళనలు వారిలో కనిపిస్తున్నాయి.

 

 

ఇలాంటి సమయంలో జగమొండి లాంటి జగన్ ను కట్టడి చేయాలంటే టీడీపీకి కోర్టులు ఒక్కటే రాజమార్గంగా కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టు ఇటీవల హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జగన్ కు వ్యతిరేకంగా బాగా తీర్పులు వస్తున్నాయి. జగన్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలను కోర్టులు అడ్డుకుంటున్నాయి. దీంతో జగన్ ను అడ్డుకోవాలంటే కోర్టులే దిక్కు అన్న అభిప్రాయం టీడీపీ నాయకుల్లో క్రమంగా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.

 

 

తాజాగా టీడీపీ సోషల్ మీడియా మరో అస్త్రం ప్రయోగిస్తోంది. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సామూహికంగా లేఖలు రాయాలని నిర్ణయించింది. ఏమని అంటే.. జగన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఇలా రాజకీయ నాయకులు ఏళ్లకు ఏళ్లు బెయిళ్లపై ఉండే అవకాశం ఇవ్వకుండా విచారణ సత్వరమే పూర్తి చేసి ఏదో ఒక తీర్పు వచ్చేలా చేయండి మహాప్రభో అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.

 

 

అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం అంటే అంత సులభం కాదు. అందుకే.. ఓ రెడీ మేడ్ ఫార్మాట్ రెడీ చేయించి దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే సంతకాల సేకరణ టైపు అన్నమాట.. దాన్ని ప్రింటు తీసుకుని సంతకం పెట్టి పోస్టు చేయడమే. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ లేఖలను పరిగణనలోకి తీసుకుని జగన్ కేసును అర్జంటుగా తేల్చే పనికి పూనుకుంటారా అంటే అనుమానమే. ఏదేమైనా టీడీపీ మాత్రం సోషల్ మీడియా మంత్రంతో సుప్రీంకోర్టు అనే అస్త్రాన్ని వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: