'చే' అంటే విప్లవం. సాహసం. ఉత్తేజం. 'చే' అంటే ధైర్యం. చే అసలు పేరు 'ఎర్నెస్టో గువేరా దిలా సెర్నా. 1928 జూన్‌ 14న అర్జెంటీనాలో జన్మించాడు. బాల్యంలో ఆస్తమా వుండడంతో బడికి పంపితే ఎప్పుడేం జరుగుతుందోనని భయపడిన తల్లి ఇంట్లోనే పాఠాలు చెప్పేది. సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో వైద్య విద్య అభ్యసించాలనుకున్నాడు. వైద్య విద్యార్థిగా వుండగానే, మిత్రుడు ఆల్బర్ట్‌ గ్రనేడాతో కలిసి లాటిన్‌ అమెరికా దేశాలు పర్యటించాడు. ఈ సమయంలోనే ప్రజలపై సాగుతున్న దోపిడి, మోసాల గురించి విని చలించిపోయాడు. 1953 జూలైలో మరోసారి లాటిన్‌ అమెరికా దేశాలు పర్యటించాడు. ఆ సందర్భంగానే విప్లవం, సమ సమాజ స్థాపన ఆవశ్యకతను గుర్తించాడు.

 

క్యూబా విప్లవ ప్రభుత్వంలో చేగువేరా అనేక కీలక బాధ్యతలు చేపట్టి...దేశాన్ని పున:నిర్మించుకునేంత వరకు అహర్నిశలు కష్టపడ్డాడు. అయితే ఈ పదవులన్నిటినీ వదులుకుని లాటిన్‌ అమెరికా ప్రజలను ఆర్థిక, రాజకీయ, సాంఘిక దోపిడి నుంచి విముక్తి చేయాలని మళ్లీ విప్లవకారునిగా మారాడు. బొలీవియా విముక్తి పోరాటంలో గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని 11 నెలలపాటు పోరాడాడు. ఆ పోరాటంలో వుండగానే 1967 అక్టోబర్‌ 9న చేగువేరాను బొలీవియా సైన్యం అతి కిరాతకంగా హత్య చేసింది. భౌతికంగా లేకుండా చేసినా ఆయన రగిలించిన విప్లవ జ్యోతి నేటికీ వెలుగుతోంది.

 

1954లో గ్వాటెమాల చేరుకున్నాడు. అప్పటికి ఆ దేశ అధ్యక్షుడు 'జాకీబ్‌ అర్బెంజ్‌ గుజ్మాన్‌' భూసంస్కరణలు అమలు జరిపి, కొన్ని లక్షల ఎకరాలను పేదలకు పంచాడు. కార్మికుల అనుకూల శాసనాలు ప్రవేశ పెట్టాడు. దాంతో అమెరికా ఫ్రూట్‌జ్యూస్‌ కంపెనీలకు నష్టం ఏర్పడింది. అమెరికా వెంటనే గుజ్మాన్‌ని సోవియట్‌ యూనియన్‌ ఏజెంటు అని ముద్ర వేసి, అతని ప్రభుత్వాన్ని కూల్చడానికి పూనుకుంది. ఇక్కడ దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న ప్రజల పక్షాన నిలబడి పోరాడాడు చే. అమెరికా సైన్యం చే ను చంపాలనుకుంది. తప్పించుకొని, మెక్సికో నగరం చేరి, అక్కడ వైద్యునిగా ఆసుప్రతిలో చేరాడు.

 

అప్పటికే క్యూబా నియంత, అమెరికా సామ్రాజ్యవాద తొత్తు అయిన 'బాటిస్టా'కు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టు యోధుడు ఫైడల్‌ కాస్ట్రోని కలిశాడు చే. 'డాక్టరుగా రోగ నివారణ చేయడం కాదు- విప్లవకారునిగా వ్యవస్థకు పట్టిన వ్యాధిని నిర్మూలించాల'ని భావించి, క్యూబా విప్లవ పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. ఇరువురి నాయకత్వం లోని గెరిల్లా దళాలు సుమారు రెండు సంవత్సరాల పాటు పోరాడి విజయం సాధించాయి. క్యూబా రాజధాని హవానాలో కాస్ట్రో క్యూబా విప్లవ విజయాన్ని, విప్లవ ప్రభుత్వాన్ని ప్రకటించాడు. చే గువేరా క్యూబా విప్లవం లోనే గాక, క్యూబా నూతన విప్లవ యంత్రాంగాన్ని రూపొందించడంలో, ఆ దేశ అభివృద్ధిలోనూ ప్రముఖ పాత్ర వహించాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: