అచ్చెన్నాయుడుకు ఏపీ ప్ర‌భుత్వం ఉచ్చుబిగుస్తున్న‌ట్లు ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. ఇప్ప‌టికే ఈఎస్ ఐ స్కాంలో దాదాపు రూ.150అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఏసీబీ అధికారులు నిర్ధారించ‌గా..ఇప్పుడు మ‌నీలాండ‌రింగ్‌, మ‌నీలేయింగ్ కేసులు కూడాన‌మోదు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈవిష‌యాన్ని స్వ‌యంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం విలేఖ‌రుల‌కు ప్రెస్‌మీట్లో వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి  అవినీతి జరిగిందని నిరూపించాలంటే.. ముందుగా.. సదరు అరెస్టయిన వ్యక్తి లంచం తీసుకున్నట్లుగా ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది.  టెలీ హెల్త్ సర్వీసెస్‌ కు లబ్ది కలిగించేలా అచ్చెన్నాయుడు లేఖ రాశారని ఏసీబీ వాద‌న వినిపిస్తోంది.

 

 కాబట్టి..ఆ సంస్థ నుంచి అచ్చెన్నాయుడుకు లేదా.. ఆయన కుటుంబానికి చెందిన వారికి లేదా.. బినామీ కంపెనీలు అని ఆరోపించే వారికైనా… ఆ సంస్థ నుంచి ప్రయోజనం కలిగిన‌ట్లు ఆధారాలు చూపాల్సి ఉంటుంది. లేకపోతే.. ఏసీబీ అధికారులకు చిక్కులు ఏర్ప‌డ‌తాయ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో అచ్చెన్నపై.. మనీలాండరింగ్.. మనీ లేయింగ్ కేసులు పెడతామని స్పీకర్ ప్రకటించడం స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొనేలా చేస్తోంది. వాస్త‌వానికి టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేతగా ఉన్న వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి అచ్చెన్నాయుడికి మ‌ధ్య ఎన్నోసార్లు వాగ్యుద్ధం జ‌రిగింది. ల‌క్ష‌కోట్లు అవినీతికి పాల్ప‌డ్డాడ‌ని జ‌గ‌న్‌పై ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేసిన విష‌యాల‌ను ఇప్పుడు వైసీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు.

 

ఈ ఎస్ ఐ మందుల కొనుగోళ్ల‌లో భారీ అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కొంతమంది అధికారులను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అప్ప‌టి మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో అచ్చెన్నాయుడు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని అందుకే అరెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు చెబుతున్నారు.  మార్కెట్ ధర కంటే సుమారు 50 శాతం నుంచి 130 శాతం ఎక్కువ ధ‌ర‌కు మందులు కొనుగోలు చేసినట్టు  దర్యాప్తులో వెల్ల‌డైంద‌ని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాథ‌మికంగా అంచ‌నా మేర‌కు మందుల కొనుగోళ్లలో రూ.150 కోట్లు అక్రమాలు జరిగినట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడుతో పాటుగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: