ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ  ఏప్రిల్ 30, 1910 జ‌న్మించారు. జూన్ 15, 1983న ప‌ర‌మ‌ప‌దించారు.  శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యారు. విప్లవ కవిగా, సంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా అతను ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది, నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం అతను రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది. సమస్యలపై అవగాహన , వ్యవస్ధపై విశ్లేషణ,  సమాజంపై  అవేదన, ప్రజలకై ఆలోచన కలిగిన గొప్ప కవి శ్రీశ్రీ.   అక్షరాలకు కత్తులు  కట్టి యుద్ధానికి పంపించినట్లు ఉంటాయ్ అతని కవితలు.  

 

ఆకలితో ఉన్న ఆదర్శంలా,     అజ్నాతంలో ఉన్న అభ్యుదయంలా, అలుపెరుగని ఆవేదనలా, నిర్భాగ్యుల   నాయకుడిలా, ధౌర్భాగ్యుల ప్రతినిధిలా కనిపిస్తాడు, తన పదునైన ,  బరువైన, కరుకైన, చురుకైన, యాసప్రాసలతో కూడిన వాడి వేడి అక్షర కణాలను దేశం  దశదిశలా చల్లి, సమాజంలోని కుళ్ళునీ మనుషుల్లోని భయాన్నీ హృదయాల్లోని  మలినాన్నీ వ్యవస్ధలోని వైఫల్యాలనీ  అక్షరాలతో  ఆవహన చేస్తూ  చైతన్యం తేవాలని తపిస్తాడు. వేగంతో రాగంతో కోపంతో కూడిన భావ కవితావేశాన్ని మేధావుల మూర్ఖుల వృద్ధుల  యువతీయువకుల పరాజితుల విరాజితులలో ప్రసరింపచేసి, కర్షక కార్మిక శ్రామిక  అణగారిన దిగజారిన వేసారిన  ప్రజలను ప్రోత్సహించి తనతో రమ్మంటాడు.


"  హింసనణచ ధ్వంసరచన ధ్వంసరచన హింసరచన "  అంటాడు శ్రీశ్రీ.   నీతులతో చెబితే  వినపడకపోతే బూతులతో చెబుదాం మరేం తప్పు లేదంటూ  సమర్ధించి  నావంటి ఎందరికో   ధైర్యాన్ని ఇస్తాడు.  మొద్దునిద్రతో  బద్దకంతో బతికేస్తున్న  వ్యవస్దను  తట్టిలేపడం కాదు తన్నిలేపుదాం రమ్మంటూ నీ అక్షరాలకి పదును  పెట్టి   ఆయుధాలుగా చేసి వేటాడమంటాడు.  అందుకే శ్రీశ్రీ నాకు నచ్చుతాడు.    నేడు  సామాన్యుడి ఆగ్రహం ఆవేదన  ఆలోచన అసహ్యం  అసహనం ఆకలి ఆదర్శం  అభ్యుదయాలకు  అక్షరరూపాన్ని ఇచ్చి  మేల్కొలిపి మహాప్రస్ధానం సాగించి  ఎందరికో స్పూర్తినిచ్చి దిశానిర్ధేశం చేసి ఆరాధ్యుడిగా ఆదర్శప్రాయుడిగా  మారిన  ఆ మహాకవి  శ్రీశ్రీ  వర్ధంతి  సందర్భంగా ఆ మహాకవిని  స్మరించుకుంటూ...

మరింత సమాచారం తెలుసుకోండి: