టిఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఆ స్థానం ఎవరిది..? అనే ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్, హరీశ్ రావు అనే రెండు పేర్లు వినిపిస్తాయి. అందులో ఒకరు కేసీఆర్ తనయుడు, మరొకరు కేసీఆర్ మేనల్లుడు. ఇద్దరు ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో మంచి పేరు, గుర్తింపు, తెచ్చుకొని తమ పాలనలో దూసుకుపోతున్నారు. మరి కేసీఆర్ తర్వాత ఆ స్థానం ఎవరికి దక్కుతుంది అంటే.. పుత్రవాత్సల్యంతో కేటీఆర్ కే కట్టబెడతారు అని కొంతమంది అంటున్నారు. అలా చేస్తే హరీశ్ రావుతో ఇబ్బందులు తప్పవని మరికొందరు అంటున్నారు. వాస్తవానికి ఇది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన మాట కాదు. దీనికి ఇంకా చాలా సమయం ఉందని మరికొందరి వాదన.

 

కానీ, కేసీఆర్ లాంటి వ్యక్తి దేన్నైనా ముందుగానే పసిగట్టగలుగుతాడు. భవిష్యత్తులో రాబోయే సమస్యలను ముందుగానే అంచనా వేయగలడు. దీంతో హరీశ్ రావుకి చెక్ పెట్టె పనిలో పడ్డారట సీఎం కేసీఆర్. కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు హరీశ్ రావును ఇరిగేషన్ మంత్రిగా నియమించారు. ఆ శాఖలో హరీశ్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. సాగు నీరు, త్రాగు నీరు విషయంలో హరీశ్ రావు కృషి ఎనలేనిది. ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ భగీరద, డ్యాములు, నీటి నిల్వ కుంటలు, చెరువులు ఇవన్నీ హరీశ్ రావు కష్టానికి ప్రతిరూపాలే. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా హరీశ్ పుణ్యమే, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే 90% మనులు పూర్తి చేశారు.

 

ఇవన్నీ గమనించిన కేసీఆర్, రెండవ సారి అధికారంలోకి రాగానే హరీశ్ రావును మంత్రి వర్గంలోకి తీసుకోకుండా పక్కనా పెట్టారు. అప్పుడు మిగిలిన 10% కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి అంతా తానే చేసినట్టు క్రెడిట్ కొట్టేశారు కేసీఆర్. దీనిపై హరీశ్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే హరీశ్ రావును పక్కన పెట్టడంతో కొంత మంది ఎమ్మెల్యేలతో ఆయన పార్టీ మారుతున్నాడు అనే వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన కేసీఆర్ హరీశ్ రావుకి ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఆయన అభిమానుల్లో సంతోషం నెలకొంది. అలాగే చాలా మంది ఇతర మంత్రులు, పార్టీ శ్రేణులు, విశ్లేషకులు హర్షం వ్యక్తం చేశారు. అయితే అసలు గుట్టు ఇక్కడే ఉందని ఎవరూ తెలుసుకోలేకపోయారు. అదేంటంటే..

 

ఆర్థిక మంత్రి అంటే సవాళ్ళతో కూడుకున్న పనే.. ఇలాంటి పదవి హరీశ్ రావుకి ఇచ్చి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పడేయాలన్నదే కేసీఆర్ అసలు ఉద్దేశం అని తెలుస్తుంది. పైగా కరోనా కూడా కేసీఆర్ కి బాగా కలిసొచ్చిందని టాక్. అందుకు నిదర్శనం కరోనా వచ్చిన మొదట్లో మన రాష్ట్రానికి ఏం పర్లేదు ఆర్థికంగా బాగానే ఉన్నాం, ఇకపై కూడా బాగానే ఉంటాం అని చెప్పి.. ఆ తర్వాత కొన్ని రోజులకే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని చెప్పడం అని విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడేలా చేసి దానికి హరీశ్ రావుని బాధ్యుడిగా చూపి, ఆయనంతంటే ఆయనే బాధ్యత వహిస్తూ..రాజీనామా చేసేలా చేయాలని కేసీఆర్ చూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్. దీంతో హరీశ్ రావు ఒక అసమర్ధ నాయకుడిగా ప్రజల ముందు మిగిలిపోతాడు... కేటీఆర్ కి లైన్ క్లియర్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: