గ‌తానికి భిన్నంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌న పాల‌న సాగిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో చంద్ర‌బాబు ఏం చేయాల‌న్నా.. మూడు రోజులు ముందు నుంచి ప్ర‌చారం ఉండేది. అంతేకాదు, దానికి కొన‌సాగింపుగా మ‌రో నాలుగు రోజులు ఊద‌ర‌గొట్టేవారు. కానీ, జ‌గ ‌న్ అలా కాకుండా.. తాను చేయాల‌నుకున్న‌ప‌నుల‌ను చేసేస్తున్నారు. తాను ఏం చేయాల‌నుకుంటున్నారో.. ప్ర‌చారం చేయ‌డం కాదు.. చేత‌ల్లో చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా అలానే కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలోనూ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. ఇదే ప్రాజెక్టుపై గ‌తంలో చంద్ర‌బాబు భారీ ఎత్తున ప్ర‌చారం చేసుకున్న విష‌యం గుర్తుండే ఉంటుంది. ప్ర‌తి సోమ‌వారాన్ని పోల‌వారం అంటూ .. ప్ర‌చారం చేసుకున్నారు. తీరా ప‌నులు మాత్రం ఎక్క‌డిక్క‌డే ఉన్నాయి.

 

ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న స్ట‌యిలంతా డిఫ‌రెంట్‌. ఆయ‌న ఎక్క‌డా ప్ర‌చారం చేసుకోరు. తాను చేయాల‌నుకున్నది చేసేస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ పోల‌వ‌రం ప‌నులు దూకుడుగానే ముందుకు సాగుతున్నాయి. అయితే, ఎక్క‌డా త‌న సొంత మీడియాలో కూడా ప్ర‌చారం చేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కరోనా సంక్షోభంలోనూ పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. పనులను మెరుపు వేగంతో ‘మేఘా’ పరుగులు పెట్టిస్తోంది. కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా కార్మికులు వలస వెళ్లిపోతున్నారు. 

 

అయినా పోలవరంలో మాత్రం ఎక్కడా ఆ ప్రభావం లేకుండా చూస్తోంది ఆ సంస్థ. ప్రాజెక్ట్‌లోని ప్రధానమైన పనులకు ఆటంకం రాకుండా అధిగమిస్తోంది. స్పిల్‌వే, స్పిల్‌ ఛానెల్‌, అప్రోచ్‌ చానెల్‌, పైలెట్‌, చానెల్స్‌, ఎర్త్‌కమ్ ర్యాక్ఫిల్‌ డ్యాం 1,2,3 (గ్యాప్‌లు) ప్రాంతాలతో పాటు గతంలో పూర్తిగా నిలిచిపోయిన జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణ పనులు సైతం మొదలయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్‌వే పోలవరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా ఉంది. దీన్ని చేపట్టిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ లక్ష్యం మేరకు ప్రణాళికబద్ధంగా పనులు సాగిస్తోంది. 

 

ఈ ప్రాజెక్ట్‌లో 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించే విధంగా స్పిల్‌వే నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా పరిగణించే చైనాలోని త్రిగాడ్జేస్‌ జలాశయ స్పిల్‌వే వరద నీటి విడుదల సామర్థ్యం 47 లక్షల క్యూసెక్కులు. దానికన్నా పోలవరం ప్రాజెక్ట్‌ 3 లక్షల క్యూసెక్కుల అధిక సామర్థ్యంతో మేఘా ఇంజనీరింగ్‌ నిర్మిస్తోంది. ఇది పూర్త‌యితే జ‌గ‌న్ ప్ర‌పంచ రికార్డు క్రియేట్ చేసిన‌ట్టే. 2019 నవంబర్‌లో మేఘా పనులను ప్రారంభించింది. అప్ప‌టి నుంచి లాక్‌డౌన్‌లోనూ ప‌నులు దూకుడుగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. చంద్ర‌బాబు ఆర్భాటం ఎక్క‌డా లేదు.. ప‌నులు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: