జగన్ అధికారంలోకి రావడమే ఆలస్యం...చంద్రబాబు మళ్ళీ వెంటనే అధికారంలోకి వచ్చేయాలనే ఉద్దేశంతో తెగ పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు అధికారం లేకపోతే ఉండలేకపోవడం అనుకుంటా...జగన్ ఇంకా సీఎం కుర్చీలో సర్దుకోకుండానే చంద్రబాబు రాజకీయం చేయడం మొదలుపెట్టారు. పెన్షన్స్ రూ.3 వేలు ఇవ్వకుండా...సంవత్సరం సంవత్సరం రూ.250 పెంచుకుపోతానని జగన్ చెప్పిన వెంటనే...బాబు అండ్ బ్యాచ్ విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు.

 

ఇలా చేయడం వల్ల వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదు. అలా అని అప్పటికప్పుడు టీడీపీకి వచ్చిన అడ్వాంటేజ్ లేదు. అయితే వెంటనే నిరసనలు, ఆందోళనలు, పోరాటాలు చేయడం వల్ల జగన్‌కు మంచి హెల్ప్ అవుతుంది. చంద్రబాబు తప్పులని ఎత్తి చూపడం వల్ల, జగన్‌కు సర్దుకునే అవకాశం దొరుకుతుంది. దాని వల్ల ఆ తప్పులు ప్రజల్లోకి వెళ్ళడం లేదు. అయితే ఇలాంటి వాటికి ఉదాహరణలు చాలా ఉన్నాయి.

 

జగన్ పాలన మొదట్లో ఇసుక సమస్య వచ్చింది. తాత్కాలికమైన ఈ సమస్యకు చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ రెండు నెలలు జగన్ విఫలమైపోయారంటూ ఏదో కొంపలు మునిగేలా పోరాటాలు చేశారు. కానీ ఈ సమస్యకు వెంటనే పరిష్కారం కూడా రావడంతో ప్రజలు ఆ విషయాన్ని మరిచిపోయారు. ఇందులో కూడా టీడీపీకి వచ్చిందేమి లేదు.

 

ఇలాగే చాలా అంశాల్లో బాబు పోరాటాలు చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడి, అమరావతి ఉద్యమం, మద్యం ధరల పెంపు, రివర్స్ టెండరింగ్, ఇంగ్లీష్ మీడియం, ఉల్లి ధరల పెంపు, అన్నా క్యాంటీన్లు ఓపెన్, లాక్ డౌన్‌లో పేదలకు రూ.5 వేలు ఇవ్వాలని, తాజాగా అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్ట్ విషయంలో బాబు అండ్ బ్యాచ్ తెగ పోరాటాలు చేసింది. కానీ ఇవేమీ వర్కౌట్ కాలేదు. ఈ సమస్యలు తాత్కాలికమైనవే కావడంతో జగన్‌కు సర్దుకునే అవకాశం దొరికేసింది.

 

దాని వల్ల వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో పెద్దగా వ్యతిరేకిత రాలేదు. అయితే ఇలా కాకుండా బాబు వీటిపై హడావిడి చేయకుండా, అలా వదిలేసి ఉంటే జగన్‌ ప్రజల్లో బుక్ అయ్యేవారు. కానీ బాబు ఏదో జగన్‌ మీద ప్రేమ ఉన్నట్లు బాగా హెల్ప్ చేశారు. దీంతో జగన్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకిత భావన రాలేదు. అలాగే టీడీపీ కూడా ఏ మాత్రం పుంజుకోలేదు. కాబట్టి బాబు ఇప్పటికైనా హడావిడి పోరాటాలు ఆపేసి, పార్టీని బలోపేతం మీద దృష్టి పెడితే కాస్త ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. లేదంటే నాలుగేళ్ళు అయినా టీడీపీ పుంజుకోవడం కష్టం.   

మరింత సమాచారం తెలుసుకోండి: