ప్రస్తుత రోజులను బట్టి ఆషామాషీగా రాజకీయాలు నడిపించేద్దాం అంటే కుదరని పని. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ, రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, పార్టీ క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. రాజకీయాల్లో ఎప్పుడూ పరిస్థితులు ఒకేవిధంగా ఉండవు. ప్రతిరోజు నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా గుర్తించినట్లుగా కనిపించడం లేదు .పార్టీ పెట్టి చాలా కాలం అయినా... పవన్ ఇంకా రాజకీయాల్లో ఓనమాలు దిద్దుతూ ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అసలు తాను పార్టీ ఎందుకు పెట్టాను ? ఏ లక్ష్యంతో పెట్టాను ? ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నాను అనే సమీక్ష లేకుండానే పవన్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటు సినిమాల్లోనూ... అటు రాజకీయాల్లోనూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ఎక్కడా మనసు పెట్టలేకపోతున్నారు. 

IHG's exit, what happens to <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PAWAN KALYAN' target='_blank' title='pawan kalyan -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>pawan kalyan </a>and the ...


రాజకీయంగా ఇప్పుడు తాను యాక్టివ్ గా ఉన్నా చేసేదేమీ లేదని, అసలు రాజకీయాలు నడిపించాలంటే ముందు డబ్బులు ఉండాలని, ఆ డబ్బుల కోసమే తాను సినిమాల్లో చేస్తున్నానని గతంలోనే పవన్ ప్రకటించుకున్నారు.. చెప్పినట్టుగానే అప్పుడప్పుడు రాజకీయాలు అప్పుడప్పుడు సినిమాలు అన్నట్టుగా పవన్ ముందుకు వెళ్తున్నారు.  2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కనీసం 30 , 40 సీట్లు వస్తాయని ఆశలు పెట్టుకుంది. ఆ మేరకు ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ ఫలితాలు చూస్తే కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే దక్కించుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘోర ఓటమి చెందారు. పోనీ ఆ ఓటమి నుంచి తేరుకుని  మరింత యాక్టివ్ గా రాజకీయాలు చేస్తున్నారా అంటే ఇప్పటికీ  అనుమానాస్పదంగానే వ్యవహరిస్తున్నారు.

IHG


 వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ఇసుక దీక్ష, లాంగ్ మార్చ్ అంటూ హడావుడి చేసిన పవన్ ఆ తర్వాత అప్పుడప్పుడు మాత్రమే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, పార్టీకి సంబంధించిన ఏదైనా కార్యక్రమం ఉంటే ప్రెస్ నోట్ విడుదల చేస్తూ వస్తున్నారు తప్ప, ప్రజా పోరాటాలను తలకెత్తుకుని పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకువెళ్ళే దిశగా మాత్రం పవన్ అడుగులు వేయలేకపోతున్నారు. వాస్తవంగా చెప్పుకుంటే జనసేన పార్టీకి రాజకీయ భవిష్యత్తు కి తిరుగు లేనంత స్థాయిలో ప్రజాభిమానం, అభిమానులు, సామజిక వర్గం అండదండలు ఉన్నాయి. పవన్ సరైన రీతిలో వారందరినీ ఉపయోగించుకుంటూ, సరైన వ్యూహం ప్రకారం ముందుకు వెళితే రాజకీయంగా తిరుగు ఉండదు. కానీ పవన్ ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నారు. 

IHG


ఇప్పటికే జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో పవన్ విఫలం అయినట్లుగానే కనిపిస్తున్నారు. ఇప్పటికే బలమైన పార్టీగా ఉన్న వైసీపీ టీడీపీలను ఎదుర్కొని 2024 ఎన్నికల్లో అధికారం చేపట్టాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి జనసేన శ్రేణుల్లో పూర్తిగా నిరుత్సాహం అలుముకుంది. ఒకవైపు అధికార పార్టీ దూకుడుగా ముందుకు వెళుతుంటే ప్రజా ఉద్యమాలతో పాటు, వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ మరింతగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఈ విషయంలో పవన్ పెద్దగా  స్పందించడం లేదు. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నాపెద్దగా ఉపయోగం లేనట్టుగానే అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

IHG


కనీసం పవన్ కు కేంద్ర బిజెపి నాయకుల అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఉంది. ఇక బిజెపి తమ దారి తమదే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. క్షేత్ర స్థాయిలో బీజేపీ శ్రేణులను కలుపుకుని వెళ్లేందుకు జనసేన పార్టీ నాయకులు కూడా ఇష్టపడకపోవడం వంటి పరిణామాలతో ఏపీ బీజేపీ నేతలు జనసేన ను అంతగా పట్టించుకొన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు పరాజయ భారం ఉన్నా పార్టీని ముందుకు నడిపించడంలో పవన్ కాస్త తడబడుతున్నట్టుగానే కనిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి పార్టీలో కీలక నాయకులు అనుకున్న వారందరూ ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోవడం, వెళ్లిన వారంతా పవన్ వ్యవహారశైలిపై విమర్శలు చేస్తూ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి పవన్ కు పెద్ద ఇబ్బందికర పరిణామాలే. 


అసలు పవన్ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ముందుకు వెళితే 2024 ఎన్నికల నాటికి జనసేన బలమైన పార్టీగా అధికార పార్టీని దీటుగా ఎదుర్కోగలదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో ఎన్నో ప్రజా సమస్యలు హైలెట్ అయ్యాయి. ప్రజల కోసం పోరాడి, వారికి అండగా తానున్నానంటూ భరోసా ఇవ్వగలిగితే ప్రజల్లో పవన్ పలుకుబడి మరింతగా పెరిగేది. కానీ పవన్ ఆ దిశగా అడుగులు వేయకుండా, తెలుగుదేశం పార్టీకి మేలు చేకూర్చే విధంగా అడుగులు వేస్తున్నారనే విమర్శలను మూటగట్టుకున్నారు. ఏపీ లో ఇసుక సమస్య వంటి ప్రధానమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ పవన్ వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.


 పవన్ ఏపీలో రాజకీయాలు చేద్దామని చూస్తున్నా ఎక్కువశాతం ఆయన హైదరాబాద్ లోని తన నివాసానికి పరిమితమై పోవడం, షూటింగ్ లతో హడావిడిగా తిరుగుతున్నారు. ఇవన్నీ ఏపీ జనసేన నాయకులకు ఇబ్బందికరంగా మారాయి. పార్టీ తరఫున ఏ కార్యక్రమాలు చేద్దామన్నా, ఏదైనా సమస్యలను చెప్పుకుందాం అన్నా, కుదరని పని అన్నట్లుగా అక్కడి వ్యవహారం ఉంది. మొన్నటి వరకు జనసేన పార్టీలో కీలక నేతగా ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు కూడా పవన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ బయటికి వెళ్లి పోవడం వంటి పరిణామాలు జనసేనకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.


 అధికారపార్టీ టీడీపీ కీలక నేతలను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది. క్రమక్రమంగా తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో జనసేన పార్టీ యాక్టివ్ గా ఉంటూ రాజకీయాలు చేస్తే తెలుగుదేశం పార్టీ స్థానాన్ని జనసేన ఆక్రమించే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా అడుగులు పవన్  వేయలేకపోతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ప్రజల్లోనే కాక, సొంత పార్టీ నాయకులలోనూ అసంతృప్తి తీవ్రంగా నెలకొంది. పవన్ పార్ట్ టైం పొలిటిషన్ అనే ముద్ర వేసుకున్నారు. పూర్తిస్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టి ముందుకు వెళితే 2024లో ఆ పార్టీకి అవకాశం ఉండడంతో పాటు మెరుగైన ఫలితాలు కూడా వస్తాయి. అలా కాకుండా ఇదే విధంగా ఈ నాలుగు సంవత్సరాల పాటు ముందుకు వెళితే జనసేన ఇంతకంటే దారుణమైన ఫలితాలు చూడాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: