ఏపీలో రాజ‌కీయం ప్ర‌స్తుతం ఎంత హాట్ హాట్‌గా న‌డుస్తుందో ?  చూస్తూనే ఉన్నాం. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, కీల‌క నేత‌ల అరెస్టుల‌తో అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య రాజ‌కీయం ఓ రేంజులో రాజుకుంది. ఇక తాజాగా అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల వేళ కూడా టీడీపీ న‌ల్ల చొక్కాల‌తో నిర‌స‌న‌ల‌కు దిగ‌డంతో రాజకీయం బాగా వేడెక్కింది. ఇక ఇప్పుడు మ‌ళ్లీ రాజ‌కీయం వేడుక్క బోతోంది. రెండు రోజుల్లో ఏపీలో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. టీడీపీ నుంచి వ‌ర్ల రామ‌య్య పోటీలో ఉన్నారు. అటు వైసీపీ నుంచి ప్ర‌స్తుతం కేబినెట్లో మంత్రులుగా ఉన్న బీసీ నేత‌లు ఇద్ద‌రూ పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌రమ‌ణ ఇద్ద‌రూ వైసీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు పోటీ చేస్తున్నారు. వీరిద్ద‌రు ఎంపీలుగా గెల‌వ‌డం నామ‌మాత్రం కానుంది.

 

ఇక డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద రావు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇలా ఓవ‌రాల్‌గా ఏపీలో మ‌రో నెల రోజుల పాటు ఇదే హ‌డావిడి ఉండ‌నుంది. ఆ వెంట‌నే జ‌గ‌న్ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు రెడీ కానున్నారు. రాజ్య‌స‌భ‌కు ఎంపిక అవుతోన్్న ఇద్ద‌రు మంత్రుల స్థానాల్లో మ‌రో ఇద్ద‌రు కొత్త మంత్రుల‌ను తీసుకోవాల్సి ఉంది. వీరిద్ద‌రు బీసీ వ‌ర్గానికే చెందిన వారు కావ‌డంతో జ‌గ‌న్ రెండు బెర్త్‌లు బీసీల‌తోనే భ‌ర్తీ చేస్తారా ?  లేదా ఒక‌టి రెడ్డి సామాజిక వ‌ర్గం లేదా మ‌రో సామాజిక వ‌ర్గంతో భ‌ర్తీ చేస్తారా ? అన్న‌ది చూడాలి.

 

ఇక క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం నుంచి జ‌గ‌న్ కేబినెట్లో రేసులో ఉన్న చెరుకువాడ రంగ‌నాథ రాజును త‌ప్పించ వ‌చ్చ‌న్న ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఆయ‌న్ను ఇప్పుడు కాక‌పోయినా త‌ర్వాత అయినా కేబినెట్ నుంచి ఖ‌చ్చితంగా త‌ప్పించి.. ఆ ప్లేస్‌లో జ‌గ‌న్‌కు రైట్ హ్యాండ్ అయిన అదే సామాజిక వ‌ర్గానికి చెందిన న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద రాజుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌నున్నార‌ని టాక్‌.. ?  ఇక మోపిదేవి మ‌త్స్య‌కార సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో ఆ ప్లేస్‌లో అదే వ‌ర్గం నుంచి ముమ్మ‌డివ‌రం ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్‌కు మంత్రి ప‌ద‌వి రావొచ్చ‌ని అంటున్నారు. 

 

ఇక శెట్టిబలిజ వ‌ర్గం నుంచి ప్ర‌స్తుతానికి బోస్ ఒక్క‌రే మంత్రిగా ఉన్నారు. మ‌రి ఆ వ‌ర్గం నుంచి ఎవ‌రికి మంత్రి ప‌ద‌వి ఇస్తారో ?  తెలియ‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే రామ‌చంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఈ వ‌ర్గంలో కాస్త సీనియ‌ర్ నేత‌గా ఉన్నారు. ఇక నెల్లూరు జిల్లా నుంచి ఒక‌రిద్ద‌రు రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేకు జ‌గ‌న్ నుంచి హామీ వ‌చ్చింద‌ని అంటున్నారు. మ‌రి ఫైన‌ల్ కూర్పు ఎలా ఉంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: